హైదరాబాద్ : నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మబలికి దృష్టి మరల్చి రూ కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ (35) అనే వ్యాపారవేత్తకు ఇటీవల సోమవారం సాయంత్రం బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాము క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు.
దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో కోటి రూపాయల నగదును అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు.
ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఉమర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


