సాక్షి, తాడేపల్లి: రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు.. విపత్తులో నష్ట పోయిన రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుపానును కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. నష్టపోయిన రైతులను మాత్రం కనీసంగా కూడా పట్టించుకోలేదంటూ ఆయన నిలదీశారు.
‘‘పంట నష్టం అంచనాలలో కూడా రైతులను దగా చేస్తున్నారు. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఒకే ఒక్క రోజులో పంట నష్టం అంచనాలను ఎలా వేస్తారు?. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు ధైర్యంగా ఉండేవారు. ఏ విపత్తు వచ్చినా అందుకునేందుకు జగన్ ఉన్నాడనే ధైర్యం ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం ధాన్యం పండించడం అనవసరమని మాట్లాడారు. కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. ఈ ప్రభుత్వంలో అసలు యూరియా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
..పంట నష్టం జరిగితే ఆ వివరాలు తెలుసుకునే పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు. అసలు ఈ ప్రభుత్వానికి రైతు అంటే చిన్నచూపు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాల్సిందే. అంచనాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తే సహించం. వెంటనే ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించాలి. రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సాయాన్ని అందించాలి. జగన్‌ని చూసేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
..ఇదేమని ప్రశ్నిస్తే సీఐ నన్ను దుర్భాషలాడారు. పైగా కేసు నమోదు చేశారు. పోలీసులంటే గౌరవం ఉంది. కానీ అన్యాయంగా కేసులు పెట్టటం బాగోలేదు. దీనిపై మాట్లాడటానికి ఎస్పీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మా మీద కేసులు పెట్టటం కాదు, గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులు అరిట్టండి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకోండి. పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియాని అరికడితే సంతోషిస్తాం’’ అని కైలే అనిల్‌కుమార్ పేర్కొన్నారు.


