
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు.
‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్‌లో కదా..
..రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్‌సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్‌సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదా
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్‌సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు.

..రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారు
ఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్‌మెంట్‌లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు.