
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వంశీని జైల్లో ఉంచి కొందరు శునకానందం పొందారని, ఇందుకు రేపో.. మాపో.. మరో నాలుగేళ్లకో వాళ్లే అందుకు పశ్చాత్తాపం చెందుతారని అన్నారాయన.
సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఇవాళ(జులై 2, బుధవారం) విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒకే కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతూ కుట్రలు చేశారు. ఐదేళ్లు, పదేళ్లు కింద జరిగినవాటికి కూడా కేసు పెట్టారు. లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారు.
అడ్డగోలు జీతాలు తీసుకుని వాదించేవాళ్లు ఉన్నా కూడా.. వాదించడానికి ఢిల్లీ బాబాయి రావాలి అంటూ వాయిదాలు వేయించుకున్నారు. చివరకు ఇవాళ కూడా సుప్రీం కోర్టులో వంశీ బెయిల్‌ను రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఇంత చేసి సాధించింది ఏంటి?.. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమా? పోనీ..
వంశీని రాజకీయాల నుంచి పారిపోయేలా చేశారా?.. గన్నవరం ప్రజల నుంచి దూరం చేయగలిగారా?. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతిని మూటగట్టి పెట్టారు. వంశీని జైల్లో ఉంచి మీ పార్టీకి(టీడీపీని ఉద్దేశించి..) మీరే గొయ్యి తవ్వుకున్నారు. కక్ష సాధింపు తప్ప కూటమి సాధించింది ఏమీ లేదు. కేవలం శునకానందం పొందారు. రేపో,, మాపో, మరో నాలుగేళ్లకైనా దీని వెనుక ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకుంటారు అని పేర్ని నాని అన్నారు.