
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా టీడీపీ నేతల బాగోతాన్ని ఎండగట్టారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సీఐడీతో విచారణ చేయించగలరా? అంటూ ప్రశ్నించారు
‘‘2024 ఎన్నికల అఫిడవిట్‌లో మీ ఆస్తుల విలువ రెండు కోట్లు. కొల్లు రవీంద్ర కోటి రూపాయలు చందా ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం కోటి చందా ఇచ్చే స్తోమత ఉందా మీకు. వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదా?. వీకెండ్‌కు హైదరాబాద్, రెండు నెలలకోసారి దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పమంటారా?. దుబాయ్‌కి వెళ్లిన పాస్ పోర్టు, వీసా చూపించే దమ్ముందా?’’ పేర్ని నాని నిలదీశారు.
‘‘మచిలీపట్నంలో డిఫ్యాక్టో మంత్రి, ఎమ్మెల్యే.. టీడీపీ నేత గోపిచంద్. గొర్రిపాటి గోపీచంద్ తెర వెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నాడు. గొర్రిపాటి గోపీచంద్ బందర్‌లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. బైపాస్‌లో దేవుడి ఆస్తి కాజేశానని నాపై విష ప్రచారం చేస్తున్నారు. 2006లో ఆక్షన్‌లో గోపీచంద్, అతని భార్య పాల్గొన్నారా? లేదా?. గోపీచంద్ భార్య రాజేశ్వరి పేరుతో చలానా కట్టారా.. లేదా?.’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
