
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం..
.. ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?..
ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.
చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!.
టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో ఒక రౌడీషీటర్‌ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ను రౌడీ అని, పేకాట క్లబ్‌లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్‌లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్‌కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్‌లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???..
చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది.
దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్‌లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది.
ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట.
అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు.
ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.