సాక్షి, తాడేపల్లి: హిందూపురం వైఎస్సార్‌సీపీ ఆఫీసుపై దాడిని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఖండించారు. బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపిస్తే దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీటీడీ గూండాలు రెచ్చి పోతున్నారు. ప్రశ్నించే వారిపై దాడి చేస్తే ఎవరూ భయపడరు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఈ దాడులు చూస్తుంటే నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తోంది’’ అని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సతీష్ మృతి వెనుక వాస్తవాలను బయట పెట్టాలి
సతీష్ కుమార్ మృతిపై సీబిఐ, సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరపాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. సతీష్ మృతి వెనుక ఏం జరిగిందో వాస్తవాలను బయట పెట్టాలన్నారు. ఈలోపే సతీష్‌ది హత్యే అని టీటీడీ నేతలు మాట్లాడుతున్నారు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ఎలా మాట్లాడతారు?. పోస్టుమార్టం కూడా కాకముందే హత్య అని ఎలా చెబుతారు?. పోలీసుల విచారణ సజావుగా జరపాలి. సున్నితమైన కేసు కాబట్టి సీబిఐతోనో, సుప్రీంకోర్టు జడ్జితోనో విచారణ జరపాలి’’ అని శైలజానాథ్ పేర్కొన్నారు.
పరకామణిలో చోరీని గుర్తించి.. ఫిర్యాదు చేసిన సతీష్‌నే అనేకసార్లు విచారణ పేరుతో పిలవటం ఏంటి?. రాష్ట్రంలో పోలీసుల మీద పోలీసులే విచారణ జరపటం దారుణం. చెవిరెడ్డి గన్‌మెన్‌ని కూడా విచారణ పేరుతో వేధించారు. ఇప్పటికీ పదిమంది పైనే పోలీసు ఆఫీసర్లకు పోస్టింగులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. తాము చెప్పిన పనులు చేయకపోతే వీఆర్‌కు పంపుతున్నారు. పోలీసులను కూడా అనుకూలురు, వ్యతిరేకులు అంటూ విభజించటం సరికాదు.
..ప్రజా వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కొత్తకొత్త కథలు అల్లుతున్నారు. సతీష్ కుమార్ ఎలా చనిపోయాడనే వాస్తవం ప్రజలకు తెలియాలి. సతీష్ భార్య ఫోన్‌ని ఎందుకు తీసుకున్నారు?. వారి కుటుంబ సభ్యులను తమ కంట్రోల్ ఎందుకు పెట్టుకున్నారు?. వీటన్నిటిపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు.


