కేసును మూసివేయాలని సీఐడీ భావిస్తోంది
ఈ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని నేను హైకోర్టులో పిల్ వేశా
చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది
అందువల్ల సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్‌పై నిర్ణయం తీసుకోవద్దు
విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన పాత్రికేయుడు తిలక్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఓ మెమో దాఖలు చేశారు. ‘స్కిల్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేనే పిల్ దాఖలు చేశాను.
దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇదిలా ఉంటే, స్కిల్ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు సీఐడీ చర్యలు చేపడతున్నట్లు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సీఐడీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతోంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును ముగిస్తే, పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది.
అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా. అంతేకాక అలా కేసును మూసేయడం న్యాయ విరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సీఐడీ కేసును కొట్టేయాలని కోరుతూ ఆ కేసులో 37వ నిందితునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి.’ అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు.


