వెంటిలేటర్‌పై... సంజీవని! | Chandrababu Govt Lack of healthcare assurance causes anxiety among poor | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌పై... సంజీవని!

Dec 31 2025 5:19 AM | Updated on Dec 31 2025 6:08 AM

Chandrababu Govt Lack of healthcare assurance causes anxiety among poor

‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం

ఆరోగ్య భరోసా కొరవడి పేద, మధ్య తరగతి ఆందోళన 

బడుగుల ఆరోగ్యంతో  బాబు సర్కారు చెలగాటం

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకు పైగా బకాయి 

సేవలను తిరస్కరిస్తున్న ఆస్పత్రులు... ఉచిత వైద్యం అందని ద్రాక్ష.. రోగుల నుంచి అందినంత దండుకుంటున్న యాజమాన్యాలు 

బాబు ఏలుబడిలో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని స్వయంగా టీడీపీ నాయకుల ఒప్పుకోలు 

కాలు విరిగిన వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు 

ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించిన వైఎస్‌ జగన్‌ 

వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో 3,257 వైద్య ప్రక్రియలు 

ఆరోగ్యశ్రీలో చేర్పు.. చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపు.. ఆరోగ్య ఆసరాతో పేద రోగులకు ఆర్థిక భరోసా

‘ఫ్యామిలీ డాక్టర్‌’తో గ్రామీణుల చెంతకు ఉచిత వైద్యం

ఇప్పుడు ఉచిత వైద్యం కాదు.. రూ.లక్షన్నర వరకు బాదుడు 
ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్తే రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైనవారు  సింహాద్రిపురం వారు. ఇలాంటి కేసులు ఒకటి రెండు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. 
– పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ

డబ్బు కడితేనే గుండె ఆపరేషన్‌ చేస్తారట
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన స్వామి(65) ఆర్నెల్ల కిందట అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గుండె రక్త నాళాలు పూడుకుపోయాయని.. బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. కొద్ది రోజులు మందులు వాడాక సర్జరీ చేస్తామని సూచించారు. అక్టోబర్‌లో ఆరోగ్యశ్రీ కార్డుతో స్వామి, కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద అడ్మిట్‌ చేసుకోవాలని కోరారు. ‘ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం. బైపాస్‌ సర్జరీకి రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంత భరించే స్తోమత లేకుంటే వెళ్లిపోండి’ అని తేల్చిచెప్పారు. ఉసూరుమంటూ వెనుదిరిగిన స్వామి.. గతంలో వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.

ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్‌ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత కోలుకునేవరకు ఆర్థిక ఆసరా..    
-ఇది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోని భరోసా  

పేద, మధ్య తరగతికి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు రోజురోజుకు దూరం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛీత్కారం. అడ్మిట్‌ చేసుకున్నా శస్త్రచికిత్సలకు సకాలంలో అనుమతి రావడం గగనం. ఫలితంగా అప్పోసప్పో చేసి ఆస్పత్రిలో డబ్బు కట్టి ఆపరేషన్‌ చేసుకోవాల్సిన దుస్థితి..!    
-ఇదీ ప్రస్తుతం చంద్రబాబు సర్కార్‌లో దుస్థితి

మూడు ఆస్పత్రులు తిరిగినా...
గుంటూరుకు చెందిన రమేశ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. కొన్నేళ్లుగా పైల్స్‌తో సతమతం అవుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ సూచించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స కోసం గుంటూరులోని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రిని ఆశ్రయించాడు. ప్రభుత్వం నిధులివ్వడం లేదని, ఉచిత చికిత్సలు చేయడం లేదని, రూ.45 వేలు చెల్లిస్తే సర్జరీ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అంత స్థోమత లేని రమేశ్‌ మరో రెండు, మూడు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లాడు. అక్కడా ఉచిత సర్జరీ చేయలేమని చెప్పడంతో రమేశ్‌ ఇంటికి వెనుదిరిగాడు. తీవ్రమైన పైల్స్‌ సమస్యతో బాధపడుతున్నాడు.

సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, కడప/నెట్‌వర్క్‌: ఏ క్షణంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలకు జబ్బు చేసింది. ‘ఎన్టీయార్‌ వైద్య సేవ’ అంటూ పేరు మార్పులో ఉన్న శద్ధ్ర... పథకం అమలులో కొరవడింది. పేద, మధ్య తరగతికి కార్పొరేట్‌వైద్యం ఉచితంగా అందించే మహోన్నత లక్ష్యంతో దివంగత మహా నేత వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అత్యంత సమర్థంగా అమలు చేశారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఈ పథకంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడంతో  వైద్యసేవలు వెంటిలేటర్‌పైకి చేరాయి. ఫలితంగా రాష్ట్రంలో అనారోగ్యం బారిన పడిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.

1.40 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరో­గ్యశ్రీని చంద్రబాబు నీరుగా­ర్చారు. గద్దెనెక్కిన వెంట­నే ప్రైవేట్‌ ఇన్సూ­రెన్స్‌ కంపెనీలకు ప్రభుత్వ నిధులను దోచి­పెట్టే బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీని కనుమ­రుగు చేసే పన్నాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో­భాగంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా, పథకం అమలును గాలికి వదిలేశారు. ప్రభుత్వం తీరుతో ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచిత వైద్యం కోసం వచ్చినవారిని నిర్దాక్షిణీయంగా తిప్పి పంపుతున్నాయి.

బకాయిల కోసం పోరుబాట పట్టినా...
రాష్ట్రవ్యాప్తంగా 600పైగా ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులున్నాయి. వాటికి రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిని సాధించేందుకు అక్టోబర్‌లో వైద్యులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసి పెద్దఎత్తున ఉద్యమించారు. ఉద్యోగ భద్రత కోరుతూ ఆస్పత్రుల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆ సమయంలో బ్యాంక్‌ల నుంచి అప్పు తెచ్చి బకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తామని (వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. కానీ, ఉద్యమం విరమించాక మెలిక పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చే పరిస్థితి లేదని ప్రైవేట్‌ ఆస్పత్రులు నిర్ణయానికి వచ్చాయి.

రూ.లక్షల్లో గుంజేస్తున్న వైనం
బిల్లుల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్‌ ఆస్పత్రులకు అవకాశంగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెబుతున్నా పట్టించుకోకుండా డబ్బు కడితేనే వైద్యం అని రోగులకు తేల్చి చెప్పేస్తున్నాయి. ఓపీ ఫీజు, రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో, ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ వంటి వివిధ డయాగ్న­స్టిక్స్, మందులు రాసి అందినంత గుంజేస్తున్నాయి. డెలివరీ, కంటి శుక్లాలు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మొదలు మెదడు, కిడ్నీ, గుండె, క్యాన్సర్‌ వంటి పెద్ద పెద్ద జబ్బుల బాధితుల వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదు. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందిస్తామని తొలుత నమ్మబలికి... రోగిని అడ్మిట్‌ చేసు­కుని, ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లాక మరో సమస్య బయట­పడిందని, దానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటూ దోచేస్తున్నాయి.

ఈ ప్రభుత్వంలో పేదలను దోచుకుంటున్నారు
కాలు ఫ్రాక్చర్‌ అయిందని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లినవారి వద్ద ఏకంగా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల దాక వసూలు చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వర్మ సంచలన విషయం బయటపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలు దోపిడీకి గురవుతున్న తీరుకు వర్మ వ్యాఖ్యలే పెద్ద నిదర్శనం. వాస్తవానికి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఓపీ దగ్గర నుంచి వైద్య పరీక్షలు, ఇన్‌పేషెంట్‌ కింద సర్జరీలు, ఇతర సేవలన్నింటినీ   అందించాలి. అంతేకాక డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే రోజున మందులను కూడా పూర్తి ఉచితంగా రోగికి ఇవ్వాలి. వైఎస్సార్‌సీపీ హయాంలో రోగి కోలుకునేదాక  నెలకు రూ.5 వేల వరకు ఆరోగ్య ఆసరా కూడా అందించేవారు. ఈ ఆసరా సాయాన్ని బాబు ప్రభుత్వం అటకెక్కించింది.

ఉన్నతాధికారి విన్నవించినా దిక్కు లేదు
బకాయిల విషయంలో బాబు ప్రభుత్వం హామీలివ్వడం, అమలు చేయ­కుండా   మొండిచేయి చూపిస్తుండడంతో విసిగిపోయిన ప్రము­ఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీనే కాదు ఎంప్లాయీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఈహెచ్‌ఎస్‌) కింద ఉచిత వైద్య సేవలు అందించబోమని తేల్చి చెప్పేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర సచివాలయం ఉద్యోగి భార్య కిందపడి తీవ్ర గాయాలపాల­య్యారు.  తాడేపల్లిలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించి... ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్స చేయాలని కోరారు. ఉచిత వైద్యం చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని, ముందు డబ్బు చెల్లించి, తర్వాత మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పెట్టుకోమని ఉద్యోగికి ఆస్పత్రికి యాజమాన్యం సూచించింది. చేతిలో అంత డబ్బు లేకపోవడంతో సదరు ఉద్యోగి సమస్యను సచివాలయం ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఉన్న­తాధికారులకు సమస్య వివరించారు. స్పెషల్‌ కేస్‌ కింద పరి­గణించి, ఉచిత వైద్యం చేయాలని ఆరోగ్య శ్రీ సీఈవోను కోరినా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్య వైద్యానికి రూ.లక్షల్లో సొంతంగా ఖర్చు పెట్టుకు­న్నారు.

రూ.60 వేలు అప్పు చేసి చికిత్స
నెల కిందట అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లా.  కిడ్నీలో రాళ్లు ఉన్నాయని విజయవాడలోని ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తామని చెప్పి చేర్చుకున్నా మూడు రోజులైనా సర్జరీ చేయలేదు. అదేమంటే... ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి రాలేదని చెప్పారు. రోజురోజుకు నొప్పి ఎక్కువ కావడంతో రూ.60 వేలు అప్పు చేసి సర్జరీ చేయించుకున్నా. పేదింటికి చెందిన నాకు అప్పు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సకాలంలో అనుమతిచ్చి ఉంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.
    –లాజరస్, తాళ్లపాలెం, మచిలీపట్నం.


జగన్‌ హయాంలో పూర్తి భరోసా..
ఆరోగ్యశ్రీ పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి రాష్ట్రంలో పేదలందరికీ చేరువ చేశారు. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందేలా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. వైద్య ప్రక్రియలను ఏకంగా 3,257కు పెంచారు. రూ.వెయ్యికి పైగా ఖర్చయ్యే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేదలకు పూట గడవడం కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే వరకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున సాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు. 108, 104 వ్యవస్థలను గాడిన పెట్టారు. 

ప్రతి పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు వైద్యుల చొప్పున నియమించి గ్రామాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నడవలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో తీసుకున్న చర్యలు యావత్‌ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇంటింటి సర్వేలు, క్వారంటైన్‌ సెంటర్లు, వైద్యుల నియామకాల కోసం వాకిన్‌ ఇంటర్వ్యూలు, టెలి మెడిసిన్‌ తదితర సేవల పట్ల నాడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగాన్ని ఇంత సర్వోన్నతంగా మార్చేసిన స్థితి నుంచి.. చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చినట్లయింది.  


గుండె ఆపరేషన్‌కు రూ.3.5 లక్షలు ఖర్చు చేశా
నాకు అక్టోబరులో గుండెపోటు వచ్చింది. ఒంగోలు కిమ్స్‌కు వెళ్తే వైద్యులు ఆపరేషన్‌ తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లింపులు లేవని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయలేమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంగా చెప్పింది. సొంతంగా రూ.3.5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్‌ చేయించుకున్నా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంతోమంది పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకున్నారు. మందులు, ఆస్పత్రి ఖర్చులతో పాటు, కోలుకునేవరకు రోజుకు రూ.225 చొప్పున చెల్లించింది. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు.
– కుక్కల వెంకటేశ్వర్లురెడ్డి, రాజుబంగారుపాలెం, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా

పేదవారికి దక్కని భరోసా
నేను చిన్నాచితక పనులతో జీవనం సాగిస్తున్నా. గుండె నొప్పితో బాధపడుతూ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి పంపారు. పరీక్షలన్నింటికీ డబ్బు చెల్లించాలని చెప్పారు. చేతిలో డబ్బు లేదు. అనారోగ్యంతో ఉన్నా చేసేదిలేక వెనుదిరిగా. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు మాలాంటి పేదలకు భరోసా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.    
– వెంకటరెడ్డి, బొమ్మలసత్రం. నంద్యాల

వైద్యం అందక మంచంపైనే..
మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెళ్లి చేశాను. కొడుకు లారీ డ్రైవర్‌. అతడి సంపాదనే మాకు జీవనాధారం. నాకు మూడేళ్ల కిందట పక్షవాతం రాగా ఆరో­గ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందా. కుటుంబ డాక్టర్‌ కార్యక్రమంలో 15 రోజులకోసారి గ్రామానికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ఏడాదిన్నరగా ఊరికి వైద్యులు రావడం లేదు. మందులు కొనలేకపోయాను. మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స కుద­రదంటున్నారు. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యా.     
– మేరమ్మ, గండేపల్లి, ఎన్టీఆర్‌ జిల్లా.

డబ్బులు పడలేదని పంపించేశారు
నా భర్త పేరు శరవణరెడ్డి. వెనుకభాగంలో ఎముక అరిగిందని ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాం. 20 రోజులు ఉన్నాం. ఆరోగ్యశ్రీ డబ్బులు పడలేదని చెప్పి.. ఆపరేషన్‌కు రూ.50 వేలు కట్టాలన్నారు. మా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాం. దీంతో మందులు రాసి డిశ్చార్జి చేశారు. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డుతో భరోసా దక్కడం లేదు.    
 – దీపా, జంభూగోళంపల్లె, చిత్తూరు జిల్లా.


ఆపరేషన్‌కు ముందే రూ. 8 వేలు ఖర్చు
నాకు కాలు విరగడంతో ప్రొద్దుటూరు నెట్‌వర్క్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పి... ఎక్స్‌రే రాశారు. కట్టు కట్టారు. రూ.8 వేలు తీసుకున్నారు. మందులు కూడా డబ్బు పెట్టి కొన్నాం. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఇవ్వాలి కదా అని అడిగితే.. మీ ఫైల్‌ అప్రూవల్‌ కాలేదు. అన్నింటికీ డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అదనపు ఖర్చులు ఉండేవి కావు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లగానే ఆపరేషన్‌ చేసేవారు. కానీ, ఇప్పుడు దోపిడీ జరుగుతోంది. అడిగినా పట్టించుకునే నాథుడు లేడు. 
    – రామరాజు, తొండూరు మండలం, వైఎస్సార్‌ కడప జిల్లా

అదనంగా చెల్లించాల్సి వచ్చింది...
మా నాన్నకు తుంటి ఎముక విరిగింది. నెల్లూరులోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తే ఖరీ­దైన మందులంటూ రూ.20 వేలు అద­నంగా వసూ­లు చేశారు. రశీదు కూడా ఇవ్వలేదు. మా అత్తకు కూడా కాలు విరిగి ఆస్పత్రికి వెళ్లాం. తొడ ఎముక చీలిపో­యిందని అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అనుమ­తులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భయపెట్టారు. ఆరోగ్యశ్రీలో గిట్టుబాటు కావడం లేదంటూ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాయి.    
 – బీబీజాన్, నెల్లూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement