తుది నోటిఫికేషన్లు జారీ.. 28కి పెరిగిన జిల్లాల సంఖ్య
ఇకపై కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలు
అస్త్యవస్తంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించిన చంద్రబాబు
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకి మార్పు
అన్నమయ్య జన్మించిన ప్రాంతం లేని జిల్లాకు ఆయన పేరు.. పోలవరం ప్రాంతం లేకుండానే పోలవరం జిల్లా
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటికి సంబంధించిన తుది నోటిఫికేషన్లు మంగళవారం ఇచ్చింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసిన మార్పులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ 16 వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య 28కి చేరింది.
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య పేరుతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు దాన్ని రద్దు చేసి చీలికలు పీలికలు చేశారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. తుది నోటిఫికేషన్ నాటికి ఆ జిల్లాలో మిగిలిన రాయచోటిని మదనపల్లె జిల్లాలోనూ, రాజంపేటను వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనూ కలిపి దానికి రూపురేఖలు లేకుండా చేశారు.
పేరు అన్నమయ్యది.. జిల్లా మదనపల్లెది
రాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య పేరును మదనపల్లె జిల్లాకు పెట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా దాంతో ఆయనకు సంబంధం లేదు. అన్నమయ్య స్వస్థలం రాజంపేట ప్రాంతంలోని తాళ్లపాక. ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో కలిపారు. కానీ ఆయన పేరును పక్కన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పెట్టారు.
ఎన్నికల సమయంలో రాయచోటిలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని, దాన్ని మార్చబోమని అక్కడి ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చేశారు.
పేరు పోలవరం.. ఊరు రంపచోడవరం
అన్నమయ్య పుట్టిన ప్రాంతంతో సంబంధం లేని ప్రాంతానికి ఆయన పేరు పెట్టినట్లే.. పోలవరంతో సంబంధం లేని ప్రాంతంతో ఒక జిల్లా ఏర్పాటు చేసి పోలవరం పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రెండు ముక్కలు చేసి కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో ఉన్నదే మూడు నియోజకవర్గాలు కాగా దాన్ని విడగొట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఒరిజినల్ పోలవరం ఏలూరు జిల్లాలో ఉండగా, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టారు. ఈ నిర్ణయంతో పోలవరం పేరుపై గందరగోళం నెలకొనడంతోపాటు రంపచోడవరం పేరుకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఒకే ప్రాంతాన్ని రంపచోడవరం, పోలవరంగా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
తగ్గిన బాపట్ల ప్రాధాన్యం
బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి బాపట్ల ప్రాధాన్యాన్ని తగ్గించారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినా అది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే వాదన వినిపిస్తోంది. 2023లో శాస్త్రీయ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటిని అస్తవ్యస్తంగా మార్చి శాస్త్రీయత లేకుండా చేశారు.
చంద్రబాబు తనకు రాజకీయంగా పట్టు లేని ప్రాంతాలను దెబ్బతీసేలా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ ప్రాంతాలుగా చెప్పుకునే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలను మాత్రం కదల్చకపోవడం ద్వారా పునర్విభజనలో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు సైతం టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగినట్లు తేటతెల్లమైంది.


