ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత!
నిధుల సద్వినియోగంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం
పోలవరానికి 2025–26 బడ్జెట్లో రూ.5,936 కోట్లు కేటాయించిన కేంద్రం
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,034 కోట్లే కేటాయించాలని పీపీఏ ప్రతిపాదన
మిగతా మొత్తాన్ని 2026–27లో కేటాయించాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సూచన
2024–25లో రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాన్సుగా 2 విడతలుగా రూ.5,052.71 కోట్లు విడుదల
అందులో ఇప్పటివరకు రూ.4,352.71 కోట్లు వ్యయం.. ఇప్పటికీ మిగతా రూ.700 కోట్లను పోలవరం ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయని రాష్ట్ర ప్రభుత్వం
నిధులను వినియోగించుకుని ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో చంద్రబాబు సర్కారు తాత్సారం
ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ నిధులు విడుదల చేయని కేంద్రం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2026, మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం అడ్వాన్సు రూపంలో రెండు విడతలుగా రూ.5,052.71 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించిన మేరకు ఎస్‌ఎన్‌ఏ(సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనుల కోసమే వ్యయం చేయాలి.
కానీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ ఎత్తిచూపినప్పుడు మాత్రమే ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేస్తోంది. దీంతో.. గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.5,052.71 కోట్లలో ఇప్పటిదాకా రూ.4,352.71 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.700 కోట్లను ఇప్పటికీ ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో బాబు ప్రభుత్వం జమ చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.5,936 కోట్లు ఇంకా విడుదల చేయలేదు.
దీంతో ఆ నిధుల్లో రూ.3,034 కోట్లు మాత్రమే విడుదల చేయాలంటూ కేంద్ర జల్ శక్తి శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు సరిపోతాయని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా మిగతా నిధులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని సూచించింది.
నాడు రిజర్వాయర్.. నేడు బ్యారేజ్
పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. 2004–05లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆమోదించిన ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసి.. కుడి, ఎడమ కాలువ కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో చేపట్టింది.
2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, ఫైలట్ ఛానల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో డయాఫ్రం వాల్, జలవిద్యుత్ కేంద్రంలో అత్యంత కీలకమైన పనులను పూర్తి చేసింది.
చంద్రబాబు సర్కారు చారిత్రక తప్పిదం
చంద్రబాబు సర్కారు 2014–19 మధ్య గోదావరి ప్రవాహాన్ని మళ్లించేసేలా స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. గ్యాప్–2లో డయాఫ్రం వాల్ వేయడం ద్వారా చారిత్రక తప్పిదం చేసింది. దీంతో వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్ గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతింది. ఇక గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం వరద ఉద్ధృతికి కోతకు గురై ధ్వంసమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం గ్యాప్–2లో కోతకు గురైన ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చింది.
డయాఫ్రం వాల్‌కు మరమ్మతు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్నది కేంద్రం అప్పట్లో తేల్చలేదు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. 2022–23 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసేదని ఆ ప్రాజెక్టు పనులను ఆది నుంచీ నిశితంగా పర్యవేక్షించిన అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే దానికి టీడీపీ మంత్రులు అంగీకరించడం.. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం అందరినీ విస్మయపరిచింది.
దీని వల్ల డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 115.44 టీఎంసీలకు తగ్గిపోతుంది. దీని వల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించవచ్చునని అధికారులు చెబుతున్నారు. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కిందని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
19 నెలల్లో ఒక్క ఇల్లూ పూర్తి చేయని బాబు సర్కారు
పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లను మంజూరు చేయడానికి 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. భారీ వరదలు వంటి విపత్తులు ఉత్పన్నమైతే ప్రాజెక్టును పూర్తి చేసే గడువును మరో ఏడాది అంటే 2027 మార్చి నాటికి పొడిగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా 2024–25లో రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేసింది.
విదేశీ నిపుణుల కమిటీతో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించి.. సత్వరమే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో విఫలమైంది. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికీ సాగడం లేదు.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం కోసం పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటినీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని ఉంటే.. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు ఈ పాటికే కొలిక్కివచ్చేవని అధికారవర్గాలే చెబుతుండటం గమనార్హం.


