రెండు రోజులుగా శ్రీకాళహస్తిలో చెన్నై పోలీసులు
తిరుపతి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన నేత డ్రైవర్ హత్య కేసు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌చార్జి వినుత కోట డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్యకేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీచేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్ వినుత డ్రైవర్ మృతదేహం ఈ ఏడాది జూలై 10న చెన్నై కూవం నదిలో లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో వినుత, చంద్రబాబు దంపతుల్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారిద్దరు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
తరువాత కొద్దిరోజులకు రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పేరును పదేపదే ప్రస్తావించటంతో రాజకీయంగా టీడీపీకి షాక్ తగిలింది. జనసేన నేత వినుత ఆరోపణలు, రాయుడు సెల్ఫీ వీడియో ఆధారంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డిని విచారించేందుకు చెన్నై పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుజిత్‌కుమార్‌రెడ్డికి సమన్లు జారీచేసి సెల్‌ఫోన్ డేటాతో పాటు, అతడి బ్యాంకు లావాదేవీలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. మరోవైపు జనసేన పార్టీ కార్యకర్త పేట చంద్రశేఖర్‌కి సమన్లు జారీచేసి సోమవారం శ్రీకాళహస్తిలో విచారించారు. అతడి నుంచి ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను తీసుకున్నట్లు సమాచారం. మృతుడు రాయుడు బ్యాంక్ లావాదేవీల వివరాలను సేకరించి, అతడి నాయనమ్మను మరోసారి విచారించినట్లు తెలిసింది.
మృతుడు రాయుడు శ్రీనివాస క్లినిక్‌లో చికిత్స పొందిన ఆధారాలను కూడా నమోదు చేశారు. రాయుడు చనిపోవడానికి ముందు బంగారు దుకాణంలో చైన్ కొనుగోలు చేసినట్లు లభించిన ఆధారాల మేరకు ఆ షాపు యజమానితో మాట్లాడిన పోలీసులు ఆ బిల్లులను సేకరించారు. రాయుడు బంధువులు, స్నేహితులను విచారించి వారి బ్యాంకు వివరాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. వినుత తండ్రి భాస్కర్‌తోపాటు వారు ఉంటున్న ఇంటి యజమానిని, వినుత ఇంట్లో పనిమనిíÙని కూడా పోలీసులు విచారించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.
తన రాజకీయ ప్రాబల్యం తగ్గించే కుట్రలో భాగంగానే రాయుడు హత్య జరిగిందని, ఈ హత్యకు దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ చేపట్టాలని కోరుతూ అందుకు కొన్ని ఆధారాలను నిందితురాలు వినుత పోలీసులకివ్వడంతో ఆదిశగా విచారణ చేపట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండురోజుల్లో బొజ్జల సు«దీర్‌రెడ్డికి సమన్లు ఇచ్చి స్టేట్‌మెంట్ నమోదు చేయనున్నట్లు సమాచారం. దీంతో రాయుడు హత్యకు గురికాలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారమూ సాగుతోంది.


