సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం
నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు
ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారు పదవి నుంచి తొలగించాలి
జలద్రోహం చేస్తూ చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లింపు
సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోసం ఢిల్లీలో ధర్నా చేద్దాం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుకు తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు భారీగా గండి పడుతుందన్నారు. ‘రేవంత్... నీళ్ల బాధ నీకేం తెలుసు, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని ఆంధ్రాకు, చంద్రబాబుకు దాసోహం అనడం మానుకో’ అని సీఎంకు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అనుమతులు వచ్చాయని, ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
పేరు ఏదైనా జలదోపిడీ తెలంగాణ నుంచే...
‘గోదావరి–బనకచర్ల ద్వారా జలదోపిడీకి యత్నించిన ఏపీ.. నష్టాన్ని తగ్గించుకునేందుకు గోదావరి నల్లమలసాగర్ లింకు పేరిట ప్రతిపాదనల్లో మార్పు చేసింది. బనకచర్ల, నల్లమలసాగర్ పేరు ఏదైనా జరిగేది తెలంగాణ జలదోపిడీ మాత్రమే. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి చంద్రబాబు సూత్రధారి, సీఎం రేవంత్ పాత్రధారి. కత్తి చంద్రబాబుది అయినా జలద్రోహానికి పాల్పడుతూ రేవంత్ తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి బీఆర్‌ఎస్ బల్లెం పట్టి పొడిచినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. బనకచర్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి రేవంత్ సంతకం చేయడాన్ని మేము ఎండగడితే బండారం బయట పడింది.
బనకచర్ల ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ఏపీ ప్రకటించినా పోలవరం– నల్లమలసాగర్ లింకు ప్రతిపాదించింది. పోలవరం బనకచర్ల లింకు ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్‌కు తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం 45:21:14 నిష్పత్తిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణా బేసిన్‌కు బదులుగా పెన్నా బేసిన్‌కు గోదావరి నీటిని తరలించే కుట్రకు రేవంత్ పాల్పడుతున్నాడు. తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్టకు నీటి వాటా దక్కకుండా గంపగుత్తగా తరలించేందుకు ‘పోలవరం నల్లమలసాగర్’ పేరిట ఏపీ ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోంది. ఈ కుట్రను కర్ణాటక, మహారాష్ట్ర అర్థం చేసుకున్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
దోపిడీదారుల ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్
‘రెండు రాష్ట్రాల నడుమ జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన సంయుక్త కమిటీలో చంద్రబాబు దాసుడు, దోపిడీదారుల ఏజెంట్, తెలంగాణ నీటి హక్కులకు సైంధవుడిలా అడ్డుపడిన ఆదిత్యనాథ్‌దాస్‌తోపాటు ఏపీ మూలాలు కలిగిన మరో ఇద్దరిని రేవంత్ ప్రభుత్వం నియమించింది. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ అయితే రేవంత్ జలద్రోహిలా తయారైండు. కేంద్రం ఇచ్చిన అనుమతుల ప్రకారం 200 టీఎంసీల జలాలు ఏపీ తీసుకుపోయే వెసులుబాటు ఉంది. బనకచర్ల విషయంలో ఇప్పటికైనా నిద్రలేచి సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్‌ను తొలగించడంతోపాటు జల వివాదాల పరిష్కార కమిటీ నుంచి కూడా తెలంగాణ వైదొలగాలి. బనకచర్ల అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అలాగే, సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోసం ఢిల్లీలో ధర్నా చేద్దాం’ అని హరీశ్‌రావు చెప్పారు.


