
ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్య
ఏపీలో ఐదేళ్ల ఫించన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
నేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే..
తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్ కూడా చేశారాయె!
ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు.
ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు.
తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో..
హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.
ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు.
సూపర్ సిక్స్ ఎఫెక్ట్‌తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్‌ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్‌దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక..
మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు.
అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.