సాక్షి, విశాఖపట్నం: సీఐఐ సదస్సు వేళ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను వైట్ ఎలిఫెంట్(ప్రతిష్టాత్మకంగా కనిపించినా.. ఆర్థికంగా నష్టాన్ని కలిగించే ప్రాజెక్ట్)తో పోల్చిన ఆయన.. ప్రతీసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదని తేల్చేశారు.
శనివారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘మూడు నెలలకొకసారి రివ్యూ నేనూ చేస్తున్నా. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని ఉంది. కార్మికులు ఇంట్లో పడుకొని పని చెయ్యకపోతే జీతాలు ఎవరు ఇస్తారు?. ప్రతీసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదు. అన్ని స్టీల్ ప్లాంట్‌లకు లాబాలు వస్తుంటే వైజాగ్ స్టీల్‌కు ఎందుకు రావడం లేదు?. పబ్లిక్ సెక్టార్‌లో ఉందని బెదిరిస్తామంటే కుదరదు. ప్రతీసారి జీతాలు ఇవ్వాలంటే ఎలా?. ప్రైవేటీకరణ చెయ్యనని నేను చెప్పాలా? ప్యాకేజీ ఇచ్చాం కదా?.. ఏం తమాషాగా ఉందా??’’ అని అన్నారు.
మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కుట్ర కొనసాగుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులపై యాజమాన్యం కొత్త నిబంధనలు తెచ్చింది. ప్రొడక్షన్ శాతాన్ని బట్టి జీతమంటూ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉత్పత్తితో జీతానికి సంబంధం ఏంటి? అని నిలదీస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీ చేస్తే నిబంధనలు ప్రకారం జీతం ఇవ్వాలని.. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆంక్షలు తేవొద్దని.. వెంటనే సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


