సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వానికి బాధ్యత లేదా?. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుపాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. గిట్టుబాట ధర, సబ్సిడీ ఇచ్చాం. అది మా ప్రభుత్వ విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు. సీఎం, మంత్రులు మాటలు చెప్తున్నారు.. చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకూ పంట నష్టంపై ప్రకటన చేయలేదు.
రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా?. రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు కదా?. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. రైతులకు వైఎస్సార్, జగన్ హయాంలో మంచి జరిగింది. రైతులకు మంచి చేయడం మానేసి విమర్శలు చేస్తే ఎలా?. జగన్ రైతుల దగ్గరకు వెళ్లారు.. సమస్యలు తెలుసుకున్నారు. ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావడం లేదు. ఈ 18 నెలల కాలంలో ఏ జిల్లాకు రైతులకు ఎంత మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ వివరాలు వెల్లడించండి. ఈ ప్రభుత్వం రైతులపట్ల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. ఆక్షేపన చేస్తున్నా. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్యం మాకు ప్రధానం. ఏ వర్గానికి ఏమీ వద్దు అనేది కూటమి విధానం. వైద్య విద్యను అమ్మేస్తామనడం కరెక్ట్ కాదు. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత.
కాశీబుగ్గపై బాధ్యత లేదా?
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగితే అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. ఇవేం మాటలు. ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా?. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా.. బాధ్యత లేదా?. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సీఎం అంటే అందరికీ ముఖ్యమంత్రే. తిరుపతి, సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుంది?. ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. రైతులు, వైద్యం, విద్య, భక్తులు ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
కూటమి ప్రభుత్వ పాలన వలన ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. కళ్లతో చూసి పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఏదైనా జరిగితే వైఎస్సార్‌సీపీ వాళ్లని ఎలా ఇరికించాలా అని ప్రభుత్వం పని చేస్తుంది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాశీబుగ్గ ఘటనకు కారణాలు ఏమిటి? ఎవరు బాధ్యులు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

నకిలీ మద్యం కేసుపై..
నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. లేదా టీడీపీ నేత జయచంద్రా రెడ్డికి సంబంధం లేదని చెప్పండి. నన్ను అడిగితే జోగి రమేష్‌కు సంబంధం లేదని చెప్తా?. ఎప్పుడు ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యం బయటపడినా ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తారు.. గతంలో డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్లను ఎందుకు వదిలేశారు. టీడీపీ ఎంపీ మనిషి డ్రగ్స్ కేసులో ఉంటే ఎందుకు వదిలేశారు?. డ్రగ్స్ అంశంలో గతంలో సీబీఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి మేమే ల్యాండ్ పూలింగ్ చేసాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి ఫ్లైట్ రాక కోసం టార్గెట్ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ మాట్లాడితే భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధం లేదు. మీరు చేయాల్సింది అది కాదు. ఎయిర్ పోర్టుకు అప్రోచ్ రోడ్స్ తేవాలి. చుట్టుపక్కల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’ అని హితవు పలికారు.


