
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. దీంతో, చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది.
బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో విష్ణుకుమార్..‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది. టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్ నుంచి దించేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ మాట చెప్పారు. మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వం ఉన్న లొసుగులు మరోసారి బహిర్గతమయ్యాయి.