సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్‌సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ విజయంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధిరావాలని అవినాష్‌రెడ్డి అన్నారు. కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18 వేలు వంటి పథక పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్‌ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి టీడీపీ నాయకులకు లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు క్రైంను నమ్ముకున్నారు.
..పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితి అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం’’ అని అవినాష్‌రెడ్డి చెప్పారు.


