‘పవన్‌కు ‘పీపీపీ’ పక్కాగా సూట్‌ అవుతుంది’ | YSRCP Leaders Satirical Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘పవన్‌కు ‘పీపీపీ’ పక్కాగా సూట్‌ అవుతుంది’

Dec 3 2025 12:58 PM | Updated on Dec 3 2025 1:16 PM

YSRCP Leaders Satirical Comments On Pawan Kalyan

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని వ్యాఖ్యలు చేశారు. అలాగే, పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్‌కు వర్తిస్తాయని పార్టీ నేత సతీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్‌సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..‘కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి ఇష్టపడి పనిచేయాలి. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది.  

ఈ ప్రభుత్వంలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18,000, వంటి పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్‌ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. అందుకే పచ్చ పార్టీ నేతలు దాడులు, నేరాలు చేస్తున్నారు.

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితిని అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం అని అన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య, నీచమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ప్లాప్ అయ్యాయి. చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ఎల్లో మీడియా ద్వారా డబ్బాలు కొట్టుకుంటున్నాడు. పీపీపీ విధానం పవన్ కళ్యాణ్‌ మాత్రమే వర్తిస్తుంది. పీపీపీ అంటే పవర్, ప్రోటోకాల్, ప్యాకేజీ.. ఇవి పవన్‌కు వర్తిస్తాయి. మహిళలకు ఏడాదికి 18000, మూడు సిలిండర్లు, నిరుద్యోగ భృతి రైతు భరోసా పంటి పథకాలను చంద్రబాబు తుంగలో తొక్కాడు. జెడ్పీటీసీ ఎన్నికలలో పులివెందులలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement