సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడతారని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం కోసం చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలకు పాల్పడతారు. అధికార దుర్వినియోగంలో చంద్రబాబు పీహెచ్‌డీ పొందారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు, లోకేష్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. పల్నాడులో జంట హత్యల కేసును పిన్నెల్లి సోదరుల మీద బనాయించారు. టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని హత్యలు చేసుకున్నాయని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించారు. మరి అలాంటప్పుడు పిన్నెల్లి సోదరుల మీద కేసు ఎందుకు పెట్టారు?. ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ నేతని కూడా టీడీపీ రెండో వర్గమే హత్య చేసింది. దోచుకుని, దాచుకునే విషయంలో గొడవలు పడి వారికి వారే హత్యల దాకా వెళ్తున్నారు. అలాంటి కేసుల్లో మా వారిని ఎందుకు ఇరికిస్తున్నారు?
జోగి రమేష్ సోదరుల మీద కూడా అలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ములకలచెరువులో నకిలీ మద్యం బయట పడినప్పుడు జోగి రమేష్ లేడు. ఆ తర్వాత కావాలనే జోగి బ్రదర్స్ మీద అక్రమ కేసు పెట్టారు. కొందరు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. చంద్రబాబుకు అధికారం శాశ్వతం కాదని తెలుసుకుంటే మంచిది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఒంటినిండా రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుదారి పట్టించి బెయిల్ తెచ్చుకున్నారు. సాక్షులను బెదిరించటానికి వీల్లేదని బెయిల్ ఇచ్చే ముందు కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారు.
ఇవన్నీ బయటకు తెలుస్తాయని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రోజుకొక వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. పల్నాడులో చంద్రబాబు హయాంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. వైఎస్సార్, జగన్ హయాంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. డిప్యూటీ సీఎం సినిమాకు వెయ్యి, ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు రూ.500 రేటు పెంచారు. నారా లోకేష్ సినిమా తీస్తే రూ.1500 పెంచుతారు. అధికార దుర్వినియోగం చేయటంలో కూటమి నేతలు ముందున్నారు’ అని ఎద్దేవా చేశారు.


