కాకినాడ జిల్లా: తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పెన్షన్ నగదు పంపిణీ సమయంలో ఒక ఉద్యోగి ఇంటి పన్ను బకాయిలను తగ్గించుకుని డబ్బులు ఇచ్చిన ఘటన వివాదానికి దారితీసింది. పెన్షన్ డబ్బులు తమ హక్కు అని, వాటిని ఇతర బకాయిలకు ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. ఇంటి పన్ను మా ఇష్టము వచ్చినప్పుడు కడతాం, పెన్షన్ డబ్బులు కట్ చేయవద్దు అంటూ ఒక మహిళ.. సదరు ఉద్యోగిని నిలదీసింది.
కాగా, బాధితురాలు మాట్లాడుతూ.. పెన్షన్ నగదు ప్రజల హక్కు అని, దానిని ఇతర బకాయిలకు జమ చేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ మాటలతో ఆగ్రహించిన ఉద్యోగి, తనని ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నిస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులు పెన్షన్ డబ్బులు కట్ చేయడం అన్యాయం అని, ఇది ప్రజల హక్కులను ఉల్లంఘించడం అని ఆరోపించారు.


