సాక్షి, విజయవాడ: ఏపీ ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం చేతకాలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఎంత వెతికిన కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పు చేయడానికి వీలుండదు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించడం.. సంపద సృష్టి చేతకాలేదని తేలిపోయింది. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. ఇక అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరంటూ చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు.
బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్‌లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్‌సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది.


