సాక్షి, శ్రీకాకుళం: కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమని.. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి.. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’’ అని బొత్స నిలదీశారు.
‘‘చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు?.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు?. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.
సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాత్రులం అంటే కుదరదు.. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీదిరి
సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. మహిళలే అధికంగా చనిపోయారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం.. ఈరోజు వైఎస్సార్‌సీపీ నేతలు అందరం కలిసి బాధితులను పరామర్శించాం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం..

రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?: కన్నబాబు
కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటన కలిచివేసింది.. క్షతగాత్రులంతా నిరుపేదలు. నిమితమాత్రులమంటూ బాబు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రైవేట్ ఆలయం అని మాట్లాడుతున్నారు. ఆసుపత్రులను ప్రైవేటుకు ఇచ్చినట్టు.. ఆలయాలను కూడా ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పండి. సినిమా హీరోయిన్ వస్తే రోప్ పార్టీ వేసి భద్రత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఆలయాల్లో భద్రత కోసం ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా.? రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?. ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటన మాటెంటి..? కాశీబుగ్గలో జరిగింది ప్రైవేట్ ఘటన కాదు.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. కష్టం అంటే జగన్ ముందుంటారు.


