కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పార్కు వద్ద బాలుడిని చితకబాది, బాలికను ఎత్తుకుపోయిన దుండగులు లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొవ్వూరులో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలికకు అదే ప్రాంతానికి చెందిన బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ బాలిక 10 రోజుల నుంచి స్థానిక రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌కు వచ్చి అక్కడే ఉంటోంది.
ఈ నెల 15న ఆ బాలుడు రాజమహేంద్రవరం రావడంతో ఆ రాత్రి బాలిక, బాలుడు ఎస్పీ బంగ్లాకు ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పార్కులో కలిశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మద్యం మత్తులో ఉన్న క్వారీ ప్రాంతానికి చెందిన పెద గంజా, మరో వ్యక్తి అక్కడకు వచ్చారు. బాలుడిని చితకబాదిన తర్వాత పెద గంజా అనే వ్యక్తి బాలికను క్వారీ ప్రాంతంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు.
ఆమె 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయానికి ఈట్ స్ట్రీట్‌కు చేరుకుని విషయాన్ని బాలుడికి ఫోన్‌లో చెప్పింది. అనంతరం ఆ బాలుడు వచ్చి 112కు ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెద గంజాతోపాటు బాలుడిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసిన పెద గంజాపై పలు చోరీ కేసులున్నాయి. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ విషయాన్ని గోప్యంగా ఉంచారు.


