సాక్షి, అమరావతి: అక్రమార్జనే పరమావధిగా ప్రభుత్వ పెద్దలు, చినబాబు, పలువురు మంత్రులు, కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. లాభాపేక్ష లేకుండా పేదలకు పక్కా ఇళ్లను నిరి్మంచే ఏజెన్సీలను సైతం వదలడం లేదు. దీంతో గత వైఎస్ జగన్ హయాంలో తలపెట్టిన ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే టీడీపీ కూటమి నేతలు ఆదాయార్జన మార్గాలపై కన్నేశారు. ఇందులో భాగంగా జగనన్న కాలనీల్లోని ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై వాలిపోయారు. వాటిని నిరి్మంచే ఏజెన్సీల నుంచి అందినంత వరకూ దండుకునేందుకు ముందుగా వాటిపై ఆరోపణలు చేశారు. దీంతో విజిలెన్స్ విచారణ పేరిట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు ఆపేశారు.
ఫలితంగా రూ.80 కోట్లకు పైనే ఏజెన్సీలకు నిధులు ఆగిపోయాయి. ఇక ఈ బిల్లుల విడుదలకు ఏజెన్సీల యజమానులతో టీడీపీ నాయకులు రాయ‘బేరాలు’ మొదలుపెట్టారు. వీరు డిమాండ్ చేసినంత కమీషన్లు ఇవ్వడానికి సిద్ధమైన వారి బిల్లులే విడుదల చేయాలంటూ అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, గుంటూరు సహా పలు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆప్షన్–3 ఇళ్ల పెండింగ్ బిల్లుల మంజూరుకు ఏకంగా 20 శాతానికి పైగా కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
మంత్రి సారథి సిఫార్సులు..
నిజానికి.. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ దశల వారీగా బిల్లులు చెల్లిస్తుంది. ఆప్షన్–3కు సంబంధించి లబ్ధిదారులు, నిర్మాణ ఏజెన్సీ, బ్యాంకు కలిపి త్రైపాక్షిక (ట్రై పార్టీ బ్యాంకు) అకౌంట్లు తెరిచారు. పునాది, లెంటెల్, శ్లాబ్ ఇలా వివిధ దశల నిర్మాణం ఆధారంగా స్థానిక గృహ నిర్మాణ సిబ్బంది బిల్లు మంజూరుకు ప్రతిపాదిస్తారు. వివిధ దశల్లో స్రూ్కటినీ అనంతరం ఆటోమేటిక్‌గా బిల్లులు బ్యాంకు ఖాతాలో జమకావాలి. గత ప్రభుత్వంలో ఇదే విధానం కొనసాగింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాగానే కొత్త సంస్కృతికి తెరలేపారు.
ఏజెన్సీల నిర్వాహకులు నాయకులను ప్రసన్నం చేసుకుని మంత్రిని కలిస్తే ఆయన బిల్లుల మంజూరుకు సిఫార్సు చేస్తున్నారు. ఇలా తనను కలిసిన వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశిస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా ఆన్‌లైన్‌లో నిష్పక్షపాతంగా జరగాల్సిన బిల్లింగ్ ప్రక్రియకు కూడా ఓ మంత్రి సిఫార్సు చేయడం చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కమీషన్ల బాగోతం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
బెదిరించడమే ఆ సీనియర్ ఎమ్మెల్యే పని..
మరోవైపు.. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేస్తున్న వారిని టార్గెట్ చేసి, బెదిరించి డబ్బు వసూలుచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పరంపరలో భాగంగా ఆ జిల్లాలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలపై అనేక ఆరోపణలు చేసి, చివరకు వాటితో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అలాగే, ఉత్తరాంధ్రకు చెందిన ఇంకో టీడీపీ నాయకుడికి గృహ నిర్మాణ శాఖలో నామినేటెడ్ పోస్టుని కట్టబెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కూడా ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు, ఇతర జిల్లాల్లోని ఏజెన్సీల యజమానులతో ఆయన డీల్ కుదుర్చుకుని వారికి బిల్లులు మంజూరుచేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.


