వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్ పేరుతో దోపిడీకి రంగం సిద్ధం
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో నాడు ఒప్పందం తప్పన్న చంద్రబాబు
ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో అధిక ధరకు సోలార్ ఒప్పందాలు
‘సెకీ’ విద్యుత్ యూనిట్ రూ.2.49.. బాబు కొంటున్నది యూనిట్ రూ.3.09
డిస్కమ్‌ల కోరిక మేరకు టారిఫ్‌ను ఆమోదించిన ‘ఏపీఈఆర్‌సీ’
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంటే అదేదో నేరం, ఘోరం అన్నట్లు చిత్రీకరించిన చంద్రబాబు ఇప్పుడు అదే సౌర విద్యుత్ కోసం యూనిట్‌కు ఏకంగా రూ.3.09 ప్రైవేట్ సంస్థలకు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలను ఇంకా తగ్గిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే కరెంట్ చార్జీల బాదుడుతో షాకులిస్తుండగా తాజాగా వ్యవసాయానికి సౌర విద్యుత్ పేరుతో ప్రైవేటు సంస్థలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు ఉపక్రమించారు.
రైతులకు మేలు చేస్తున్నామనే ముసుగు వేసి, కమీషన్ల కోసం అడ్డగోలుగా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకవైపు కేంద్ర పథకాల ద్వారా రాయితీలు పొంది మరోవైపు అన్నదాతలకు ఇవ్వాల్సిన రాయితీని దారి మళ్లించేందుకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నుంచి ఆమోదాన్ని సాధించారు. ప్రైవేటు సౌర విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన ధరలను నిర్ణయిస్తూ ఏపీఈఆర్‌సీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫీడర్లు దగ్గరే ఉన్నా... గ్రిడ్ నుంచే విద్యుత్
రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏటా డిస్కమ్‌లకు సుమారు రూ.12,500 కోట్లు రాయితీగా అందించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తు పథకం ఆటంకం లేకుండా ముందుకు సాగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల ఉచిత విద్యుత్‌ను ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందుకు ‘పీఎం కుసుమ్’ పథకాన్ని అడ్డుపెట్టుకుంది.
రాయితీలు వస్తాయని, సరఫరా నష్టాలు తగ్గుతాయంటూ ‘అగ్రికల్చర్ ఫీడర్స్ సోలరైజేషన్’ విధానాన్ని తెరపైకి తెచి్చంది. తద్వారా వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఫీడర్లకు అవసరమైన కరెంట్‌ను సమీపంలో నెలకొల్పే సోలార్ ప్యానళ్ల ప్రాజెక్టు ద్వారా అందిస్తామని చెబుతోంది. దీనికోసం మూడు డిస్కమ్‌ల పరిధిలో తొలుత కొన్ని పంపుసెట్లను ఎంపిక చేశారు.
కుప్పం రెస్కోతో కలిపి మూడు డిస్కంల పరిధిలో మొత్తం 1,162.8 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో 2,93,587 పంపుసెట్ల సోలరైజేషన్‌కు ప్రణాళిక సిద్ధమైంది. దీని ప్రకారం 1162.8 మెగావాట్లకు యూనిట్ రూ.3.09 చొప్పున ఏడాదికి రూ.600 కోట్లు ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకీ నుంచి అయితే యూనిట్ రూ.2.49కే వస్తున్నందున ఆ వ్యయం రూ.482 కోట్లు మాత్రమే అవుతుంది. అంటే ఏటా అదనంగా దాదాపు రూ.116 కోట్లను ప్రైవేటు సంస్థలకు పాతికేళ్ల పాటు దోచిపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు..
ప్రైవేటు సంస్థలు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని, ఆ విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయని, దానికి చెల్లించాల్సిన యూనిట్ ధరలను నిర్ణయించాలంటూ ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. ఏపీఈపీడీసీఎల్‌లో యూనిట్‌కు రూ.3.18, ఏపీఎస్పీడీసీఎల్‌లో యూనిట్‌కు రూ.3.16, ఏపీసీపీడీసీఎల్‌లో యూనిట్‌కు రూ.3.19 చొప్పున చెల్లిస్తామని తెలిపాయి.
అయితే జీఎస్టీ భారం తగ్గుతున్నందున సోలార్ ప్యానెళ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సిన ధరను కూడా తగ్గించాలని కమిషన్ సూచించింది. ఈ క్రమంలో డిస్కంలు మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి పంపించాయి. వాటి ప్రకారం యూనిట్‌కు రూ.3.09 చొప్పున ప్రైవేటు సంస్థలకు చెల్లించి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది.
మరోవైపు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థలతో ఈ నెలాఖరులోగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకానికి అర్హత పొందినట్లుగా పరిగణిస్తుంది. అప్పుడే రాయితీ వర్తిస్తుంది.
యాక్సిస్ నుంచి యూనిట్ రూ.4.60 కి కొనుగోలు
వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనే సంకల్పంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా, పవర్ గ్రిడ్‌ను సమతూకం చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని అతి తక్కువ ధర యూనిట్ రూ.2.49కే కొనేందుకు పీపీఏ చేసుకుంది.
ఇలా తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు పాతికేళ్ల పాటు ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామంటూ సెకీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి దాదాపు రూ.లక్ష కోట్ల ప్రయోజనం సమకూరుతుంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించాల్సింది పోయి కూటమి నేతలు, ఎల్లో మీడియా, టీడీపీ కరపత్రికలు విషం గగ్గాయి.
సెకీ విద్యుత్ లాభం కాదంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేశాయి. కానీ తర్వాత యాక్సిస్ ఎనర్జీతో యూనిట్ రూ.4.60 చొప్పున 400 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీఏ చేసుకుంది. సెకీ ధరతో పోల్చితే యూనిట్‌కు రూ.2.11 అదనంగా చెల్లిస్తోంది. తద్వారా దాదాపు రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి నిస్సిగ్గుగా తెరదీశారు. అది చాదన్నట్టు ఇప్పుడు సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.09 కొంటామంటోంది.
‘సెకీ’ విద్యుత్ చౌకగా తీసుకుంటే తప్పన్నారు..
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ పచ్చ పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాయించారు. మరి ఇప్పుడు అంతకు మించి అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడం గమనార్హం.
నాడు సెకీతో ఒప్పందం పాతికేళ్లుకాగా, ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో చేసుకునే ఒప్పందం కూడా అన్నే ఏళ్లు కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల నేరుగా డిస్కంలపైనా, పరోక్షంగా ప్రజలపైనా ఆరి్థక భారం పడుతుందని వాదించిన చంద్రబాబు ఇప్పుడెందుకు అదే మార్గంలో నడుస్తున్నారనేదానికి ఆయనే సమాధానం చెప్పాలి.


