ఎవరు ఇబ్బంది పెట్టినా చెప్పండి
● విద్యార్థుల్లో ధైర్యం నింపిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ
● శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఏర్పాటు
● చట్టాలపై అవగాహన
గాయపడిన విద్యార్థికి న్యాయం చేస్తాం
పొందూరు: మండలంలోని లోలుగు గ్రామంలో సుమారు 3 నెలల కిందట కేజీబీవీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినికి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తా మని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. లోలుగు కాలనీలోని నివాసముంటున్న విద్యార్థినిని శైలజ బుధవారం పరామర్శించారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. మూడు నెలలుగా విద్యార్థిని నడవలేని పరిస్థితిలో ఉందని, ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విద్యార్థిని తల్లి చైర్‌పర్సన్‌ను వేడుకొన్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేశారని విచారణకు ఎంత వరకు వచ్చిందనే విషయంపై సమాచారం తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఎచ్చెర్ల: విద్యార్థినులను ఎవరు ఇబ్బంది పెట్టినా సంబంధిత కమిటీలకు ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైల జ తెలిపారు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని, మహిళా కమిషన్ తరఫున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వారం కిందటే ఇక్కడ నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల నిర్వహించలేదన్నారు. లైంగిక వేధింపులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ(ఐసీసీ)లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇబ్బందులు ఉంటే ఈ కమిటీకి చెప్పకోవాలని సూచించారు. ట్రిపుల్ ఐటీలోనూ ఈ కమిటీ వేసినట్లు తెలిపారు. విద్యార్థినులు యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే నిజానిజాలపై ఆరా తీయాలని, అలా జరగడం లేదని అందుకే ఐసీసీ కమిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కమిటీలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీని రెసిడింగ్ ఐసీసీగా శ్రీకాకుళం క్యాంపస్‌కు నియమించారు. ఆమెతో పాటు అడ్వకేటర్ పద్మజ, ఎచ్చెర్ల హెడ్‌కానిస్టేబుల్ టి.సరిత, ముగ్గురు విద్యార్థులు, వార్డెన్లు తదితరు లు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీకి ఫిర్యాదు వచ్చిన 3 నెలల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని క్యాంపస్ సిబ్బంది తెలిపారు.
విద్యార్థినులతో చర్చలు
ఈ సందర్భంగా కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించి సిబ్బంది, అధికారులను బయటకు పంపించి కేవలం విద్యార్థినులతో మాత్రమే ఆమె మాట్లాడారు. విద్యార్థినుల సమస్యలన్నీ నోట్ చేసుకుని వారికి ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. అనంతరం ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కొత్తా మధుమూర్తి కూడా లోపలకు వెళ్లి పిల్లలతో మాట్లాడారు. ఇబ్బందులు ఎదురైతే మెయిల్ చేయవచ్చన్నారు.
చర్యలు తీసుకుంటాం..
కళాశాలలో పిల్లలతో పాటు సిబ్బంది సమస్యలు కూడా తెలుసుకున్నామని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మధుమూర్తి తెలిపారు. ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ అవసరమని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారని వీటిపై చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేజీవీడీ బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ నిర్మలారాణి, బాలల సంరక్షణాధికారి రమణ, జేఆర్‌పురం సీఐ అవతారం, స్థానిక ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


