బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
సరుబుజ్జిలి: రొట్టవలసలోని కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అవతరాబాద్ గ్రామానికి చెందిన సురవరపు రామినాయుడు(77) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామినాయుడు రొట్టవలస వెళ్లి తన స్వగ్రామం అవతరాబాద్ వస్తుండగా శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామినాయుడు కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు.
20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2, టెక్కలి, పలాస డిపోల ద్వారా రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలకు త్వరితగతిన వస్తువులు డోర్ డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైస్‌మిల్లుల్లో తనిఖీలు
శ్రీకాకుళం రూరల్: వప్పంగి, వాకలవలస గ్రామాల్లోని రైస్‌మిల్లులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ బుధవారం తనిఖీ చేశారు. సీతారామ మోడరన్ రైస్‌మిల్, లలిత ట్రేడర్స్ ధాన్యం మిల్లుల్లో స్టాక్ రికార్డులను పరిశీలించారు. వప్పంగి, రామచంద్రపురంలలో ప్రైవేట్ వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. తూకాల్లో తేడా లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జేసీతో పాటు జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తదితరులు ఉన్నారు.
రక్తదాన శిబిరం విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం టౌన్‌హాల్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతాడ వరుణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, లుకలాపు గోవిందరావు, కరణం శ్రీనివాసరావు, రాజు, ఆబోతుల రామ్మోహన్, డాక్టర్ సుధీర్, కింజరాపు రమేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ల సదస్సుకు హాజరు
శ్రీకాకుళంపాతబస్టాండ్: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. డేటా ఆధారిత పాలన, ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
‘ఉపాధి’ పథకం పేరు మార్చడం తగదు
శ్రీకాకుళం అర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వీబీ జీ రాంజీ’గా పేరు మార్చడం తగదని, ఇది మహాత్మా గాంధీని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పీసీసీ పిలుపు మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చారి్‌జ్ గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి, మామిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం


