కమీషన్ కోసం కక్కుర్తి!
● డ్వాక్రా సభ్యులకు తెలియకుండా రూ.10 లక్షల రుణం మంజూరు ● పొదుపు ఖాతాలో జమ చేయించిన నౌపడ వెలుగు సీఎఫ్ ● వడ్డీ భారంతో సభ్యుల ఆందోళన
సంతబొమ్మాళి: బ్యాంకులు, డ్వాక్రా సభ్యులకు అనుసంధానంగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన వెలుగు సీఎఫ్ (కమ్యూనిటీ ఫెసిలిటేటర్) నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సభ్యులకు శాపంగా మారింది. నౌపడ గ్రామానికి చెందిన మదర్ థెరిస్సా ఎస్‌హెచ్‌సీ గ్రూప్ సభ్యులకు తెలియకుండా గ్రూప్ పేరిట నౌపడ వెలుగు సీఎఫ్ డి.సాయిలక్ష్మి రూ.10 లక్షలు రుణాన్ని నౌపడ స్టేట్‌బ్యాంకులో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంజూరు చేయించారు. ఈ మొత్తాన్ని మదర్ థెరిస్సా పొదుపు ఖాతాలో జమ చేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా సభ్యులకు మాత్రం సీఎఫ్ చెప్పలేదు. దీంతో సభ్యులకు తెలియకుండా పొదుపు అకౌంట్ నుంచి ప్రతి నెలా వడ్డీ కింద రూ.7500 వేలు చొప్పున మూడు నెలలగా రూ.23వేలు కట్ అయింది. బుధవారం పొదుపు, లోన్ బ్యాంకు బుక్‌లను సభ్యులు పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. దీంతో సీఎఫ్ సాయిలక్ష్మిని సభ్యులు నిలదీశారు. తమకు తెలియకుండా తమ సంతకాలు, ఫొటోలు లేకుండా, తీర్మానం చేయకుండా రూ.10 లక్షలు రుణం ఏ విధంగా మంజూరు చేయించావని ప్రశ్నించారు. ఆ డబ్బులు తమ చేతికి రాకపోయినా ప్రతి నెలా రూ.7500 వేలు చొప్పున రూ.23వేలు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కమీషన్ కోసం తమను బలి పశువులు చేశావంటూ సభ్యులు మండిపడ్డారు. కాగా, రుణం మంజూరు అయినది, లేనిదీ ఎప్పుటికప్పుడు తెలుసుకోవాలని సీఎఫ్ సాయిలక్ష్మి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు సభ్యులను బెదిరింపులకు పాల్పడటం కొసమెరుపు. రుణం డబ్బులు తమ చేతికి రాకపోయినా రూ.23 వేలు వడ్డీ చెల్లించామని, దీనికి ఎవ్వరు బాధ్యత వహిస్తారంటూ సభ్యులు ఆందోళన చెపట్టారు.
పరిశీలిస్తాం..
ఎస్‌హెచ్‌సీ గ్రూపులకు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు గురించి సభ్యులకు తెలియజేయకపోవడం అవగాహనా రాహిత్యం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రుణం మంజూరు, వడ్డీ విషయమై బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం.
– శ్రీనివాసరావు,
వెలుగు ఏపీఎం, సంతబొమ్మాళి


