నాట్యం నేర్పేదెలా..?
కళా సేవ.. చూపండి తోవ
● తరగతుల నిర్వహణకు
ఇబ్బంది పడుతున్న నాట్య గురువు
● నాట్యాలయానికి చోటు చూపించాలని విజ్ఞప్తి
శ్రీకాకుళం కల్చరల్: రఘుపాత్రుని శ్రీకాంత్.. సిక్కోలు గడ్డపై నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నాట్య కళాకారుడు. వందలాది మంది నాట్యకారులను తయారు చేసిన దిగ్గజ గురువు. కానీ ఆయన నాట్యం నేర్పించడానికి శాశ్వత ఏర్పాటు లేక అల్లాడుతున్నారు. కొన్నాళ్లు అద్దె ప్రాతిపదికన, మరికొన్నాళ్లు దాతల దయతో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు.
జిల్లా కేంద్రంలో దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట శివశ్రీ నృత్య నికేతన్ పేరుతో ఆయన నృత్య శిక్షణ మొదలుపెట్టారు. కానీ ఇన్నేళ్లలో సొంతంగా ఓ నాట్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. వేల మందిని నాట్యంలో సుశిక్షితులను చేసినా సొంతంగా ఓ భవనం కట్టుకోలేకపోయారు. శ్రీకాంత్ దగ్గర ప్రస్తుతం 300 మంది వరకు భరతనాట్య, కూచిపూడి సంప్రదాయాల్లో నృత్యం నేర్చుకుంటున్నారు. ఈయన శిష్యుల్లో జూనియర్ విభాగంలో నలుగురికి, సీనియర్ విభాగంలో ఒకరికి సీసీఆర్టీ స్కాలర్ షిప్ రావడం జిల్లా స్థాయిలో ప్రప్రథమం. అంతే కాకుండా శ్రీకాంత్ శిష్యుల్లో ఐదుగురు కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ సాధించగా, ఒకరు పీహెచ్‌డీ కూడా పొందారు.
ఎన్నో వినతులు అయినా..
ఎన్నో పర్యాయాలు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నా ఆయనకు ఎక్కడా స్థలం గానీ ఇల్లు గానీ మంజూరు కాలేదు. నగర పరిధిలో స్థలం మంజూరు చేస్తే నాట్యాలయం ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటుందని శ్రీకాంత్ శిష్య బృందం కోరుతోంది. గతంలో అఫీషియల్ కాలనీలోని పాడుపడిన భవనంలో నిర్వహించుకునేందుకు ఆప్పటి కలెక్టర్ ఇవ్వగా దాన్ని రూ.2.50లక్షలతో బాగుచేయించి కొన్నాళ్లు తరగతులు నిర్వహించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ వచ్చి ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఒక దాత దయతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీకాంత్ కోరుతున్నారు.


