పెన్షన్ వేలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం కల్చరల్:
ిపంఛనుదారులకు అన్యాయం చేస్తూ దొడ్డిదారిన ప్రవేశపెట్టిన పెన్షన్ వేలిడేషన్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ పెన్షనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తాత్కాలిక పద్ధతిన నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వాళ్లు రిటైరయ్యాక పాత పద్ధతిలో నెలకు రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ కింద ఇస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.9 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, బ్యాంకులు, రైల్వే, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులంతా కలిసి అసోషియేషన్‌గా ఏర్పడి సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు. ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు బి.ప్రసాదరావు, కన్వీనర్ కె.చంద్రశేఖరరావు, బీఎస్‌ఎన్‌ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వేంకటేశ్వరరావు, ఎం.రమేష్, ఏఐబీడీఓటీపీ ప్రతినిధి ఎం.గోవర్దనరావు తదితరులు పాల్గొన్నారు.


