పంచాయతీల్లో విభజన రగడ
సారవకోట : మండలంలో పలు పంచాయతీలలో విభజన రగడ రాజుకుంటోంది. అలుదు, వడ్డినవలస, మాకివలస గ్రామాలు కలిసి అలుదు పంచాయతీ ఇప్పటి వరకు ఉంది. ప్రస్తుతం వడ్డినవలస, మాకివలస గ్రామాలను కలిపి ఒక పంచాయతీగా, అలుదు ఒక పంచాయితీగా విభజించాలని కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఇదివరకు మాదిరిగానే మూడు గ్రామాలతో కలిసి పంచాయతీగా కొనసాగాలని సర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు కోరుకుంటున్నారు. ఇదే విషయమై సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. ఈ క్రమంలో బుధవారం పంచాయతీ విభజనపై అలుదు రామాలయంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిగించారు. ఇరువర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీ సింహాచలం తెలిపారు. కాగా, గొర్రిబంద పంచాయతీలో కూడా ప్రస్తుతం ఉన్న ఎన్నికల పోలింగ్ బూత్‌ల ప్రకారం విభజించుకునేందుకు పలువురు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచాయతీలోని ఎస్టీ గ్రామాలన్నీ కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎస్టీ నాయకులు, ప్రజలు కోరుతున్నారు. దీంతో ఈ పంచాయితీ విభజన విషయంలోనూ రగడ జరుగుతోంది.


