దర్భంగా: భారత్‌పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పహల్గాంలో మన పౌరులపై దాడి చేసి, ఆడబిడ్డల నుదుటిపై సిందూరాన్ని తుడిచేసిన ముష్కరులపై 20 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు.
అమిత్ షా మంగళవారం బీహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే ఫిరంగులను పాక్ ముష్కర మూకలపై ఎక్కుపెట్టనున్నట్లు స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ భద్రతను నిర్లక్ష్యం చేశామని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తే బీహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వస్తుందని ప్రజలను అమిత్ షా అప్రమత్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘షాబుద్దీన్ అమర్ రహే’అంటున్నారని ఆక్షేపించారు. జంగిల్‌రాజ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు ఆరాటపడుతున్నారని, ప్రజలు అందుకు అంగీకరించబోరని తేలి్చచెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంపైనున్న కమలం గుర్తుపై మీటను నొక్కితే సుపరిపాలన వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రను అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు.


