భర్త వదిలేశాడని.. అప్పుడే పుట్టిన బిడ్డను వద్దన్న తల్లి
పసికందుకు పాలివ్వడానికి నిరాకరణ
గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో బాలింత వేదన
గోరఖ్‌పూర్ (యూపీ): నమ్మిన భర్త నట్టేట ముంచాడన్న ఆవేదన.. అండగా ఉండాల్సిన సమయంలో మరో మహిళతో చెక్కేశాడన్న ఆగ్రహం.. ఆవేదన కలగలిసిపోయాయి. అవన్నీ ఆమెకు పుట్టిన పసికందుకు శాపంగా పరిణమించాయి. తనను మోసం చేసిన వ్యక్తి ఆనవాళ్లు బిడ్డలో ఉన్నాయి కాబట్టి.. పుట్టిన నవజాత శిశువును అంగీకరించేందుకు ఒక తల్లి నిరాకరించింది. గోరఖ్‌పూర్‌లో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి.
రైలు ప్రయాణంలో ప్రసవం
ఢిల్లీలో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న ఒక మహిళ, నిండు గర్భిణిగా ఉన్నప్పుడు భర్త తనను వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. రైలు ప్రయాణంలో ఉండగా పురిటి నొప్పులు రావడంతో, రైల్వే పోలీసుల సాయంతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, భర్తపై ఉన్న కోపంతో ఆ పసివాడికి పాలివ్వడానికి కూడా ఆమె నిరాకరించింది.
కౌన్సెలింగ్‌తో కరిగిన మనసు
ఆసుపత్రి సిబ్బంది గంటల తరబడి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెలో తల్లి మేలుకుంది. ‘వాడికి నా భర్త పేరు పెట్టను.. బిడ్డను నేనే పెంచుకుంటాను’.. అంటూ మనసు మార్చుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వగానే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ జై కుమార్ తెలిపారు.


