దేశంలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్న ప్రజలు
ఏటా 15 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు చెబుతున్న అధ్యయనాలు
దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 3.5 ఏళ్లు తగ్గినట్లు షికాగో వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
దేశంలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోని ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో 2022–24 మధ్య ఢిల్లీలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులకు 2 లక్షల కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చారంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన 2024 అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం కలుíÙతమైన గాలిని పీల్చడం వల్ల భారత్‌లో ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.
వాయు కాలుష్యం వల్ల దేశ సగటు ఆయుర్దాయం 3.5 ఏళ్లు తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయం 2025 ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) వెల్లడించింది. గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరి్టక్యులేట్ మ్యాటర్–2.5 (పీఎం) ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 40 ్పమైక్రోగ్రాముల వరకు ఆమోదయోగ్యం. అంటే గాలిలో 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంతో కలిసిన దుమ్ము, ధూళి, పొగ కణాలు అన్నమాట. గాలిలో ఈ కణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క.
ఏడాది పొడవునా..
దేశంలో వాయు నాణ్యత సంక్షోభం అంతకంతకూ విస్తృతమవుతోంది. ఈ ఏడాది 256 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు జరపగా 150 కేంద్రాల్లో వాయు కాలుష్యం నిర్దేశిత ప్రమాణాలను మించిపోయిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తెలిపింది. చాలా మంది పట్టణవాసులకు అనారోగ్యకర లేదా ప్రమాదకర గాలిని పీల్చడం ఏడాది పొడవునా నిత్యకృత్యంగా మారింది. 2025లో ఢిల్లీలో పీఎం–2.5 స్థాయి రోజుకు క్యూబిక్ మీటర్‌కు 107–130 మైక్రోగ్రాములుగా³ నమోదైంది. ఇది దేశంలో ఒక రోజు పరిమితి అయిన 60 మైక్రోగ్రాములు, డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశిత 15 మైక్రోగ్రాముల కంటే చాలా ఎక్కువ.
తగ్గుతున్న ఆయుర్దాయం..
దేశంలో 46% మంది ప్రజలు పీఎం–2.5 స్థాయి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఏక్యూఎల్‌ఐ నివేదిక తెలిపింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రజలు 4.74 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నారని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన కఠినమైన మార్గదర్శకాలను పాటిస్తే ఆయుర్దాయం 9.4 నెలలు పెరుగుతుందని అంచనా వేసింది.
ఎనిమిదిలో ఒకటి..
వాయు కాలుష్యానికి సంబంధించిన మరణాలను భారత్‌లో లెక్కించడం లేదని గ్లోబల్ క్లైమేట్, హెల్త్ అలయన్స్ చెబుతోంది. క్రమబద్ధమైన విధానాలు లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక–2025 తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి 2023లో 79 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవించాయని పేర్కొంది. అందులో పీఎం–2.5 స్థాయి కాలుష్యానికి గురై 49 లక్షల మంది మృతిచెందారని తెలిపింది.
తగ్గిన సూర్యకాంతి..
1993–2022 మధ్యకాలంలో గాలిలోని దుమ్ము, ధూళి కారణంగా దేశంలో సూర్యకాంతి దాదాపు 13% తగ్గింది. మేఘాలు అదనంగా 31–44% సూర్యకాంతి క్షీణతకు కారణమయ్యాయని ఐఐటీ కాన్పూర్‌లోని వాతావరణ శాస్త్రవేత్త సచ్చిదానంద్ త్రిపాఠి తెలిపారు. సూర్యకాంతి తగ్గితే వ్యవసాయం, సౌర శక్తితోపాటు రోజువారీ జీవితాలపైనా ప్రభావం చూపుతుందని వివరించారు. ఫొటోవోల్టాయిక్ సిస్టమ్స్‌ను బట్టి సౌర విద్యుత్ ఉత్పత్తి 12–41% పడిపోతుందని చెప్పారు.
బీజింగ్ ఒక ఉదాహరణ..
చైనాలోని బీజింగ్ 20 ఏళ్ల క్రితం ప్రపంచ పొగమంచు రాజధానిగా పేరొందింది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బొగ్గు ఆధారిత బాయిలర్స్‌ను మూసివేయడం, ప్రజారవాణా, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించడం, సాంకేతిక సంస్కరణలు, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం వంటి చర్యలను చైనా సర్కారు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఫలితంగా పీఎం–2.5 స్థాయి 2013లో ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 72గా ఉండగా గతేడాది 29.3 ్పమైక్రోగ్రాములకు తగ్గిపోవడం విశేషం.


