అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు..
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది.
ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్‌బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్‌కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
హెచ్చరించినా కూడా..
2024లో సౌదీ అరేబియా పాక్‌కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్‌ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది.
ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది.
అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్‌లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం.
వేల మంది ముఠాగా..
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్‌కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్‌ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్‌వర్క్‌ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.


