దుబాయ్‌లో భారీ వర్షం.. బుర్జ్‌ ఖలీఫా పరిస్థితి ఇది.. | Lightning strikes And Heavy Rain In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భారీ వర్షం.. బుర్జ్‌ ఖలీఫా పరిస్థితి ఇది..

Dec 19 2025 1:13 PM | Updated on Dec 19 2025 1:30 PM

Lightning strikes And Heavy Rain In Dubai

దుబాయ్‌ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్‌ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్‌ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్‌ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్‌కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement