త్వరలో ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం
చట్టబద్ధమైన సంస్థగా పనిచేయనున్న బీవోపీఎస్
న్యూఢిల్లీ: దేశంలోని నౌకాశ్రయాల్లో మౌలికవనరుల భద్రత పెంపునకు కేంద్రం నడుం బిగించింది. బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ పేరిట చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. భద్రతాపరమైన అంశాల విశ్లేషణ, సమాచార సేకరణ, పోర్టులు, నౌకలకు సంబంధించిన భద్రతాపరమైన సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడం వంటి విధులను ఇది నిర్వర్తిస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు.
బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ(బీవోపీఎస్) నిర్మాణం తదితర విషయాలపై చర్చించేందుకు గురువారం హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నౌకాశ్రయాలు, ఓడలు, జలరవాణా శాఖ మంత్రి శర్బందా సోనోవాల్, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు పాల్గొన్నారు. పటిష్టమైన నౌకాశ్రయ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
భద్రతా చర్యలను క్రమబద్ధంగా, ప్రమాద–ఆధారిత పద్ధతిలో అమలు చేయాలని అమిత్ షా ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు,, వాణిజ్య సామర్థ్యం, భౌగోళిక ప్రాంతం, సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సముద్రప్రాంత భద్రతా వ్యవస్థ ద్వారా నేర్చుకున్న పాఠాలను విమానయాన భద్రతా రంగంలో కూడా అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) తరహాలో రూపొందించనున్న బీవోపీఎస్ విభాగం మర్చంట్ షిప్పింగ్ యాక్ట్–2025 ప్రకారం చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తుంది. ఇది ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. బీవోపీఎస్‌కు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తారు. నౌకలు, ఓడరేవుల్లో భద్రతా నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను ఈయన చూసుకుంటారు.
ముందుగా ఒక ఏడాదిపాటు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ బీవోపీఎస్ డీజీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. బీవోపీఎస్ ఓడ రేవుల భద్రతా సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేíÙంచడం, సేకరించడం, పంచుకోవడం వంటి పనులను చేపడుతుంది. ముఖ్యంగా సైబర్ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఓడరేవుల్లోని ఐటీ మౌలిక వనరులను డిజిటల్ ముప్పు నుంచి రక్షిస్తుంది. దీనికోసం ఇందులోనే ఒక ప్రత్యేక విభాగం ఉంటుందని కేంద్రం ఆ ప్రకటనలో తెలిపింది.
అదే సమయంలో, నౌకాశ్రయాల భద్రతకు గుర్తింపుపొందిన భద్రతా సంస్థ (ఆర్‌ఎస్‌వో)గా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని (సీఐఎస్‌ఎఫ్)ను ఇటీవల కేంద్రం నియమించడం తెల్సిందే. ఓడరేవుల భద్రతలో పాలుపంచుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు శిక్షణ ఇస్తాయి. కేవలం లైసెన్స్ పొందిన ఏజెన్సీలు మాత్రమే ఈ రంగంలో పనిచేసేలా తగిన నియంత్రణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.


