ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న బొత్స, కన్నబాబు, రవిబాబు, కృష్ణదాసు, తమ్మినేని, సీదిరి తదితరులు
కాశీబుగ్గ తొక్కిసలాటపై న్యాయ విచారణ జరిపించాలి
రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్ధ రూల్‌బుక్‌పై లేదు
ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?
మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, కన్నబాబు, కృష్ణదాసు, తమ్మినేని, సీదిరి
దుర్ఘటన జరిగిన ఆలయాన్ని పరిశీలించిన నాయకులు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించారని.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని శాసనమండలి లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారాలకు.. రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలకు ఎలాంటి పొంతన కనిపించడంలేదని వారు ఆరోపించారు. భక్తుల తొక్కిసలాట సంఘటనపై ఆదివారం మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులంతా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్లు మజ్జి శ్రీనివాస్, పిరియా విజయ, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, కొర్ల భారతి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, ఇతర అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంచేయాలి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. అందుకే దేవుడికి కోపం వస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతో ఈ ఘోరం జరిగింది. ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పునైనా పరిహారం అందజేయాలి.
కాశీబుగ్గ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఓ ప్రధాన పత్రికలో పోలీసుల వైఫల్యం అంటూ రాశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందస్తుగా సమాచారం ఉన్నా ఎందుకు బందోబస్తును ఏర్పాటు చేయలేదు – బొత్స సత్యనారాయణ, శాసనమండలి ప్రతిపక్ష నేత
రూల్‌బుక్‌పై శ్రద్ధ లేదా?
దేవాలయాల పరిరక్షణ గాలికొదిలేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం తప్ప రూల్‌బుక్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. నిర్లక్ష్యం, వైఫల్యాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలో ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ చేతకానితనం.
చంద్రబాబు తుపాను కట్టడి చర్యలు ఏమయ్యాయి? సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే తప్పుకోవాలి. కల్తీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి, జనార్ధన్‌ను ఎందుకు అరెస్టుచేయడంలేదు. వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌పై ఎలాగోలా కేసు కట్టాలనే తాపత్రయం కనిపిస్తోంది. కేవలం ఆలయం సంఘటనను డైవర్ట్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్
భక్తులకు భద్రత కల్పించలేకపోతున్నారు..
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంతో పాటు జంట పట్టణాల్లో పోలీసుల మోహరింపు, కట్టడి చర్యలు చూస్తుంటే ఇదే శ్రద్ధ ముందే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనిపిస్తోంది. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు
పాలన గాలికొదిలేశారు..
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, పాలన గాలికొదిలేశారనడానికి కాశీబుగ్గ తొక్కిసలాటే ఉదాహరణ. తిరుపతి సంఘటనలో కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. కనీసం సింహాచలం సంఘటనతో కూడా చలనం కలగలేదు. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్‌తో పుష్కరాల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సమన్వయకర్త
ఎందరిపై కేసు కట్టారు?
కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. ఆలయ ధర్మకర్త పండాను అరెస్టుచేయాలని చూస్తున్నారు. అయితే, గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో అక్కడ ధర్మకర్తల్లో ఎంతమందిని అరెస్టుచేశారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీమంత్రి


