ఐటీ ముసుగులో అప్పనంగా భూములు
ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం.. బాబు సర్కారు బరి తెగింపు
విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమి ‘రియల్’ కంపెనీలకు కారుచౌకగా కేటాయింపు
సగం భూమిలో వాణిజ్య, రెసిడెన్షియల్ భవనాలు కట్టి అద్దెలు వసూలు చేసుకునేందుకు పచ్చజెండా
భవనం నిర్మించే ఖర్చులో అయ్యే వ్యయంలో సగ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకి రూ.2,000 చొప్పున ఎదురు చెల్లించనున్న సర్కారు
భూమి, మౌలిక వసతులు, నిర్మాణ ఖర్చు, రాయితీలు ప్రభుత్వానివే.. చివరకు లబ్ధి పొంది వసూలు చేసుకునేది రియల్ ఎస్టేట్ కంపెనీలు
అడ్డగోలుగా భూ కేటాయింపులపై సర్కారును నిలదీసిన హైకోర్టు
టెండర్లు పిలవకుండా ప్రభుత్వ భూములు ఎలా కేటాయిస్తారంటూ విస్మయం
సాక్షి, అమరావతి: అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.కోట్లు పలికే భూమి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? డబ్బులు అవసరమనుకుంటే బహిరంగ మార్కెట్ ధరకు విక్రయిస్తారు. లేదంటే డెవలప్‌మెంట్‌కు ఇవ్వడం ద్వారా మరింత ప్రయోజనం పొందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రజా ధనానికి కాపలాదారుగా ఉండాల్సిన చంద్రబాబు సర్కారు ఏం చేస్తోందో తెలుసా..? ఐటీ కార్యకలాపాల అభివృద్ధి ముసుగులో తమకు నచ్చిన సంస్థలకు అప్పనంగా 99 పైసలకే భూములు కేటాయిస్తోంది. అంతేకాదు.. అందులో 50 శాతం భూముల్లో వాణిజ్య, గృహ సముదాయాలు నిర్మించి సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తోంది. చ.అడుగుకు రూ.4 వేలు నిర్మాణ వ్యయం అయితే అందులో రూ.2 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఉదాహరణకు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భవనాన్ని నిర్మిస్తే అందులో సగం అంటే ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వ్యయాన్ని చదరపు అడుగుకు రూ.రెండువేలు చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ తరువాత అద్దెలు మాత్రం భూములు పొందిన కంపెనీలే వసూలు చేసుకుంటాయి. పోనీ ఆ కంపెనీలేమైనా ఉద్యోగాలు ఇస్తాయా? అంటే అదీ లేదు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించే వాణిజ్య సముదాయాల్లో ఒక్క ఐటీ ఉద్యోగం కూడా నేరుగా ఇవ్వవు. అవి నిర్మించే భవనాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే.. కారుచౌకగా ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని.. ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు, విద్యుత్తు లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ప్రభుత్వ డబ్బులతోనే భవనాలను నిర్మించి వేరే కంపెనీలకు అమ్ముకుంటారు. ఉద్యోగాల కల్పనకు బాబు సర్కారు నిర్వచనం ఇదీ!! భూములు ప్రభుత్వానివి..! మౌలిక వసతులు కల్పించేది ప్రభుత్వమే..! భవన నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వానిదే..! పలు రాయితీలు ఇచ్చేదీ ప్రభుత్వమే.. చివరకు లబ్ధి పొందేది మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలు! అంటే.. సర్కారు భూముల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల భూ దందా! విశాఖలో విచ్చలవిడిగా సాగుతున్న బాబు సర్కారు భూ దోపిడీ ఇలా ఉంది.
కంపెనీలకు నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున ఎదురు చెల్లించడంతో పాటు పలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో
భూములిచ్చి.. ఎదురు డబ్బులు కూడా!
వాణిజ్య భవనాలను నిర్మించుకుని భారీ ధరలకు విక్రయించుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ ముసుగులో చంద్రబాబు సర్కారు భూములు అప్పగిస్తూ చేస్తున్న ‘‘రియల్’’ దందా ఇప్పుడు జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ క్యాంపస్‌లు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పేరిట కె.రహేజా, సత్వా, కపిల్ గ్రూపు సంస్థ బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములను కేటాయించడమే కాకుండా అందులో 50 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తోంది. ఇంతటితో ఆగకుండా ప్రోత్సాహకాల రూపంలో ఎదురు చెల్లిస్తోంది. నిర్మిస్తున్న చదరపు అడుగుకు గరిష్టంగా రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎదురు డబ్బులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
కారుచౌకగా భూములు.. పలు రాయితీలు
బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. బ్లాక్ స్టోన్ వంటి పీఈ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తుంది. 2017లో సత్వా గ్రూపు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈ సంస్థకు విశాఖలో 30 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు కారుచౌకగా కట్టబెట్టింది. విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్ నెం.4పై ప్లాట్ నంబర్లు యూడీఎల్ 1, యూడీఎల్ 2, యూడీఎల్ 3 వద్ద 30 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల సబ్సిడీ ధరకే ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సత్వా కంపెనీకి 30 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు
ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్‌లో ఎకరం రూ.50 కోట్లకుపైనే పలుకుతోంది. అంటే రూ.1,500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించడం విస్తుగొలుపుతోంది. కారుచౌకగా భూమిని కేటాయించడమే కాకుండా ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ లాంటి అనేక అదనపు రాయితీలను సత్వాకు కల్పిస్తున్నారు. సత్వాకు అత్యంత కారుచౌకగా భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిబంధనల ప్రకారం సత్వా సంస్థ గత నెల 5వ తేదీలోగా ఏపీఐఐసీకి డబ్బులు చెల్లించాలి.
అయితే ఎటువంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లించేందుకు 60 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సత్వా సంస్థ కోరిందే తడవుగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశానికి తీసుకెళ్లడం.. వడ్డీ, జరిమానా లేకుండా డబ్బులు చెల్లించేందుకు ఈ నెల 4 వరకు గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ కావడం చకచకా జరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూములిస్తూ అదికూడా వడ్డీ లేకుండా చెల్లించడానికి గడువు ఇవ్వడం ఏమిటని విస్మయం వ్యక్తమవుతోంది.
రహేజా సంస్థకు రూ.1375 కోట్ల విలువైన 27.10 ఎకరాలను ఎకరా కేవలం 99 పైసలకే ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు
రహేజాకు రూ.1,375 కోట్ల భూమి కేవలం 99 పైసలకే
రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ కె.రహేజా హైదరాబాద్‌లో వేలంలో భూములు కొనుగోలు చేసి వాణిజ్య సముదాయాలు నిర్మిస్తుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం రూ.వేల కోట్ల విలువైన భూమిని ఎటువంటి టెండర్లు, దరఖాస్తులు ఆహా్వనించకుండా అప్పనంగా అప్పగించేసింది. రహేజా గ్రూపునకు విశాఖలో సుమారు రూ.1,375 కోట్ల విలువైన 27.10 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయించింది. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్ 3లో 27.10 ఎకరాలను ఏపీ లాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ ప్రకారం ఇచ్చింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్‌లో ఎకరా ధర రూ.50 కోట్లపైనే ఉంది. అంతేకాదు కేటాయించిన 27.10 ఎకరాల్లో 45 శాతం భూమిని ఐటీ కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. 
కపిల్ గ్రూప్ బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థకు 30 ఎకరాలను ఇచ్చేందుకు జారీచేసిన ఉత్తర్వులు
వీటికి అదనంగా రూ.91.2 కోట్లతో రహదారులు, నీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఇక ఇక్కడ ఉద్యోగాలు కూడా రహేజా గ్రూపు సొంతంగా ఇవ్వదు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఐటీ బిల్డింగ్‌లో వచ్చే ఐటీ కంపెనీలే ఉద్యోగాలను కల్పించాలి. ఉద్యోగాలు ఐటీ కంపెనీలు కల్పిస్తుంటే ఆ పేరుతో ప్రోత్సాహకాల రూపంలో రహేజాకు దోచిపెడుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పెట్టుబడి రాయితీ కింద 50 శాతం, చదరపు అడుగుకు రూ.2,000, నైపుణ్య శిక్షణ స్టయిఫండ్, విద్యుత్, జీఎస్టీ లాంటి అనేక రాయితీలను ప్రభుత్వం అందిస్తోంది.
కపిల్ చిట్ ఫండ్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించిన కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు పనోరమా హిల్స్ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్‌ఎంటీవీ లాంటి మీడియా సంస్థలున్న కపిల్ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే కేటాయించారు. ఇక బెంగళూరుకు చెందిన ఏఎస్‌ఎన్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు మధురవాడ ఐటీ హిల్ నెం. 3పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాల భూమిని, హిల్ నంబర్ 4పై ప్లాట్ నంబర్ యూడీఎల్ 6వద్ద 7.79 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టింది. ఇలా విలువైన భూమిని పప్పుబెల్లాలుగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుండటాన్ని న్యాయస్థానం ప్రశి్నంచడంతో రాష్ట్రంలో విచ్చలవిడి భూ పందేరం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.
ఐటీ డెవలపర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన రాయితీలు
తెలంగాణలో ఆదాయం.. ఏపీలో ఆల్ ఫ్రీ..!
ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు పప్పు బెల్లాలు మాదిరిగా అప్పగిస్తోంది. ఒకపక్క హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలకు వేలం ద్వారా భూములను విక్రయిస్తూ పోటీతత్వాన్ని పెంచి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే.. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు అత్యంత ఖరీదైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. ఎటువంటి వేలం లేకుండా, భూ కేటాయింపులకు దరఖాస్తులు ఆహా్వనించకుండా నచ్చిన సంస్థలకు ఇష్టమొచ్చిన రేటుకు భూములు కేటాయిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అన్ని కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు భూములను ఎలా కేటాయిస్తున్నారంటూ కె.రహేజాకు భూ కేటాయింపుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని ప్రశి్నంచింది.


