తేల్చిచెప్పిన విజయవాడ ఏసీబీ కోర్టు
తిలక్ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించిన కోర్టు
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నాటి మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఐఏఎస్ అధికారి శ్రీనరేష్ లపై సీఐడీ నమోదుచేసిన కేసుకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను తమకు అందచేయాలని స్వర్ణాంధ్ర తెలుగు పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ అభ్యర్థనను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. కేవలం ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ తాలుకు సర్టిఫైడ్ కాపీలను మాత్రమే ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి. భాస్కరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
హైకోర్టులో పిల్ వేశా, ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి..
2014–19 మధ్య కాలంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పలు కుంభకోణాల్లో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తిలక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో తదుపరి చర్యల నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు తదితరులపై సీఐడీ నమోదుచేసిన కేసులో తమకు ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, సాక్షుల వాంగ్మూలాలు, చార్జిషీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని కోరుతూ తిలక్ ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వీటిని పొందేందుకు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వ్యక్తిగా తిలక్ అర్హుడని ఆయన తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి ఏసీబీ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి. భాస్కరరావు ఈనెల 19న నిర్ణయం వెలువరిస్తానన్న విషయం తెలిసిందే. తాజాగా.. శుక్రవారం తిలక్ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించారు. కేవలం ఫిర్యాదు కాపీ, దాని ఆధారంగా సీఐడీ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని మాత్రమే అందించేందుకు అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మిగిలిన కుంభకోణాల్లో డాక్యుమెంట్లు ఇచ్చేందుకూ ‘నో’..
అయితే, చంద్రబాబునాయుడు, అప్పటి ఆయన మంత్రివర్గ సహచరులు లోకేశ్, నారాయణ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తదితరులపై గతంలో నమోదైన పలు కుంభకోణాల కేసులను మూసివేస్తూ ఏసీబీ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీంతో.. చంద్రబాబుపై నమోదైన కుంభకోణాల తాలుకు కేసుల్లో అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని, అలాగే కేసుల మూసివేత ఉత్తర్వులను కూడా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కూడా సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల తాలుకు సర్టిఫైడ్ కాపీలను మాత్రమే ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది.


