ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఈ విషయం తెలియని వారంటూ లేరు కానీ.. తాజా ప్రయత్నం మాత్రం పరాకాష్ట అని చెప్పక తప్పదు. రాష్ట్ర పాలన యంత్రాంగం ఘోర వైఫల్యం కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణిస్తే.. దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టుండి నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చింది. కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంలా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయించింది.
వాస్తవానికి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఆ ఘటనతో తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని కూటమి పెద్దలు అంచనాకు వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట మొదలుకొని అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతి, సింహాచలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లోనూ ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కాశీబుగ్గ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో దైవానికి ఏదో అపచారం జరిగిందన్న సెంటిమెంట్ ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది అరిష్టం అన్న భావనకు భక్తులు వస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాదు.. చంద్రబాబు విపక్షంలో ఉండగా కందుకూరు, గుంటూరు సభలలో జరిగిన తొక్కిసలాటల్లోనూ ప్రాణ నష్టం జరగడం గమనార్హం.
కుల, మత రాజకీయాలు నడపడంలో ఆరితేరిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వానికి ఈ తొక్కిసలాటల ఘటనలు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటుదని చెప్పి తప్పించుకోవాలని మంత్రులు ప్రయత్నించారు. ‘మనం నిమిత్త మాత్రులం’ అంటూ చంద్రబాబు పెదవి విరిచేసినట్లు వార్తలు వచ్చాయి. తుపానులను సైతం వెనక్కి నెట్టేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల సొంతమని టీడీపీ మీడియా బిల్డప్ ఇచ్చిన రెండు రోజులకే కాశీబుగ్గ ఘటన జరిగింది. తమకు టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏకాదశి రోజున ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావచ్చునన్న కనీస అవగాహన లేకపోయింది. పట్టణాల్లో ఏ వీధి దీపం ఆరిపోయినా రాజధానిలో కూర్చుని గుర్తిస్తామని చెప్పుకున్న చంద్రబాబు ఆలయ రద్దీని మాత్రం నియంత్రించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి.
కాశీబుగ్గలో పాండా అనే వ్యక్తి తన సొంత జాగా 12 ఎకరాలలో ఈ ఆలయం నిర్మించారట. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందీ ఆలయం. ఆ విషయం స్థానిక పోలీసులకు, అధికారులకు తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడే విషయంలో లేకుండా పోయిందని విమర్శించారు.
ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతిన్నదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం వెంటనే డైవర్షన్ రాజకీయాల్లోకి దిగినట్లు కనిపిస్తోంది. ఆకస్మికంగా నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చి మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఆదివారం ఉదయాన్నే అరెస్ట్ చేసింది. ఎల్లో మీడియా పుణ్యమా అని కాశీబుగ్గ ఘటన కాస్తా మరుగునపడి.. ఈ అరెస్ట్ అంశం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. పోలీసులు కూడా ముందస్తు విచారణ లాంటివేవీ లేకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు ఈ అరెస్ట్ స్పష్టం చేస్తోంది. నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వాహకుడు జనార్దనరావు ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా జోగిని నిర్భందించారు. జోగి దైవ సన్నిధిలో ప్రమాణం చేయడానికి అయినా సిద్దమేనని సవాల్ చేయడమే కాకుండా, ఆ ప్రకారం కనకదుర్గమ్మ గుడి వద్ద చేతిలో కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. ఇదే పని చంద్రబాబు లేదా లోకేష్ చేయగలరా అని ప్రశ్నించారు. వీటిని వారు ఎటూ పట్టించుకోరు.
ఇక్కడ చిత్రం ఏమిటంటే నకిలీ మద్యం ప్లాంట్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎల్లో మీడియాలోనే వచ్చిన రిపోర్టు ప్రకారం వేలాది బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా అయింది. ఒక్క తంబళ్ళపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయని ఈనాడు మీడియా పేర్కొంది. నకిలీ మద్యం ప్లాంట్‌ను పట్టుకున్న సందర్భంలోనే ఒక డైరీ దొరికిందని, అందులో ఈ మద్యం సరఫరా అయిన 78 మంది పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆ బెల్టు షాపుల జోలికి ఏపీ పోలీసుల మాత్రం పోలేదు. కానీ, నకిలీ మద్యం ప్లాంట్, అక్కడ ఒక పొలంలో ఉన్న మద్యం డంప్ కనుక్కున్న అధికారిని బదిలీ చేశారట. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం తాగి మోటార్ సైకిల్ నడిపి బస్ ప్రమాదానికి కారణమయ్యారు. ఆ ఘటనలో 19 మంది మరణించారు. నకిలీ మద్యమే కారణం అని ప్రకటనలు చేసిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 27 మందిపై కేసులు పెట్టారు. అక్కడ బెల్ట్ షాపుపై చర్య తీసుకోలేదు. ఆ షాపులలో నకిలీ మద్యం లేదని ఎక్కడా నిరూపించలేదు.
రెండు రోజుల క్రితం సాక్షి టీవీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద బెల్ట్ షాపులలో అది మంచి మద్యమో, కాదో తెలియని రీతిలో విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో సహా వార్తా కథనాలను ప్రసారం చేసింది. అందులో ఒక వ్యక్తి టీడీపీ ఐడీ కార్డు వేసుకుని మరీ బెల్ట్ షాపు నడుపుతున్న వైనం బహిర్గతమైంది. ప్రభుత్వం వీటికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఇబ్రహీంపట్నం వద్ద కూడా నకిలీ మద్యం డంప్ ఉందని వార్తలు వచ్చాక, అక్కడకు వెళ్లి దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టిన వ్యక్తి జోగి రమేష్. జనార్దనరావు దక్షిణాఫ్రికా నుంచి పంపిన వీడియోలో ఎక్కడా జోగి పేరు ప్రస్తావించలేదు. ఎవరితో ముందస్తు ఒప్పందం అయ్యారో కానీ, సడన్‌గా ఏపీకి వచ్చి ఆయన లొంగిపోయారు. ఆ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ ముంబై విమానాశ్రయంలో పోయిందని పోలీసులకు చెప్పినా, దానిని కనుక్కునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేశారో, లేదో తెలియదు. పోలీసు రిమాండ్‌లో ఉండగా జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం ప్లాంట్ పెట్టానని జనార్దనరావు ఇచ్చిన వీడియో ప్రకటనను బయటకు రిలీజ్ చేశారు. దానిని బట్టే ఇదంతా కుమ్మక్కు రాజకీయం అని, వైఎస్సార్‌సీపీ నేతను ఎలాగోలా ఇరికించి ఈ కేసును డైవర్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నమని జనం అందరికీ తెలిసిపోయింది.
ఇలా డైవర్షన్ చేయడంలో చంద్రబాబుకు చాలానే చరిత్ర ఉంది.. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పుడు దానిని డైవర్ట్ చేయడానికి తన ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారంటూ ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదు చేయించడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీలోని తన సన్నిహితులతో రాజీ మంతనాలు జరిపించి కేసు లేకుండా చేసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోయినా, ఒక్క అధికారిపై కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఆయన తప్పేమి లేదన్నట్లు, భక్తులదే తప్పన్నట్లుగా చిత్రీకరించగలిగారని చెబుతారు. విజయవాడలో బుడమేరు వరదలతో వేలాది మంది అల్లాడుతుంటే ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల కుట్ర అంటూ వైఎస్సార్‌సీపీపై నెట్టే యత్నం చేశారు. మొత్తమ్మీద చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో కాకుండా రాచరికంలో ఉన్నామా అనిపిస్తోంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత.


