ఒక చిన్న టీ కొట్టు యజమాని.. అతనికి సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వంటి పేరున్న నాయకుడు కలవడమే కల లాంటి విషయం. ఇక ఆయన నుంచి ఏకంగా రూ.1.50లక్షలు విలువ చేసే బైక్‌ను ఉచితంగా అందుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది?. అయినా సరే.. తన ఓటు కాంగ్రెస్‌కు వేయను అంటూ ఆ టీ కొట్టు యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే..
గత ఆగస్టు 27న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు బీహార్‌లో 14 రోజుల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో ఉన్నప్పుడు ఈ కధ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన పార్టీ సహచరులు 52 కి.మీ దూరంలో ముజఫర్‌పూర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా జాతీయ రహదారి 27లోని మాబ్బి సమీపంలోని షాపూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న మా దుర్గా లైన్ హోటల్‌లో టీ తాగారు. ఆ తర్వాత, గాంధీ భద్రతా సిబ్బంది, హోటల్ యజమాని సుమన్ సౌరభ్ (21)కి చెందిన బజాజ్ పల్సర్ బైక్‌ను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలీదు కానీ దాంతో సౌరభ్ తన హనం కోసం తీవ్రంగా అన్వేషించాడు. ‘నా లైఫ్‌లైన్ అకస్మాత్తుగా తెగిపోయింది’ అని సౌరభ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బైక్ కోసం సాధ్యమైనంత వరకు ప్రతీ తలుపును తట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయాడు.
తాను ఒక కారు అద్దెకు తీసుకుని దాదాపు 25,000 ఖర్చు చేసి తిరిగినట్టు చెప్పారు. స్థానిక కాంగ్రెస్, ఆర్జేడీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సభ్యులను సంప్రదించినా ఎవరి నుంచీ స్పష్టమైన స్పందన రాలేదని గుర్తు చేసుకున్నాడు. చివరకు స్థానిక మాబ్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా సూచించారట. అయితే, తాను కొంతమంది స్థానిక సోషల్ మీడియా వ్యక్తులను సంప్రదించడంతో వారు తన కథను హైలైట్ చేశారని అది రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని సౌరభ్ చెప్పాడు.
ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 1న గాంధీ యాత్ర ముగింపు వేడుక కోసం పాట్నా హోటల్‌లో క్యాంపెయిన్ చేస్తున్న ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ నుంచి సౌరభ్‌కి కాల్ వచ్చింది. ‘రాహుల్ గాంధీ నుంచి కొత్త మోటార్ సైకిల్ తాళం తీసుకోవడానికి సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నాకు రావాలని ఆయన కోరాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ ఆహ్వానం మేరకు సౌరభ్, మళ్ళీ కారు అద్దెకు తీసుకుని, తన తండ్రి అనిల్‌తో కలిసి పాట్నా చేరుకున్నారు, అక్కడ, పాట్నా హైకోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాహుల్.. అతడిని కలుసుకుని, రాష్ట్ర రాజధానిలోని బోరింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసి కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ తాళంను ఆయనకు అందజేశారు.
‘ఓ కొత్త మోటార్ బైక్‌ను పొందడం అనేది నాకు ఊహించని విషయం. అది కూడా రాహుల్ గాంధీ వంటి పెద్ద రాజకీయ నాయకుడి నుంచి అందుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా ఆందోళనను అర్థం చేసుకున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. బైక్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువే. ఇది నాకు చాలా పెద్ద మొత్తం ’ అని సౌరభ్ అన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో వీరిద్దరి సమావేశం వీడియోను షేర్ చేసింది. అయితే, దర్భంగా గ్రామీణ నియోజకవర్గంలో ఓటరుగా తన ప్రాధాన్యత గురించి మీడియా అడిగినప్పుడు ‘నేను ఆర్జేడీ అభ్యర్థికి ఓటు వేస్తాను’ అని సౌరభ్ నిర్మొహమాటంగా చెప్పాడు. తన కుటుంబం ఎల్లప్పుడూ ఆర్జేడీ ఓటర్లేనని సౌరభ్ స్పష్టం చేశాడు. బైక్ విషయంతో దానికి సంబంధం లేదన్నట్టుగా అతను తేల్చేశాడు. నవంబర్ ఆరో తేదీన జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో దర్భాంగా పోలింగ్‌కు వెళుతుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు.
-సత్య.


