రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పొలిటికల్ పాలన
కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన అన్ని వ్యవస్థలు
దేవాలయాలకు వెళ్లే భక్తుల ప్రాణాలకూ భరోసా కరువు
సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాపాలే శాపాలు
మొన్న తిరుపతి... నిన్న సింహాచలం... నేడు కాశీబుగ్గ
ఆలయాల వద్ద వరుస దుర్ఘటనలు..అయినా అదే నిర్లక్ష్యం
ప్రచార ఆర్భాటమే తప్ప భద్రత పట్టని చంద్రబాబు సర్కారు
పటిష్ఠ చర్యలు తీసుకుంటే వరుసగా ఘటనలు ఎందుకు జరుగుతాయంటున్న భక్తులు
2015లో చంద్రబాబు ప్రచార కండూతితో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట.. 29 మంది మృతి
విచారణ నివేదికను తొక్కిపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వం
ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్‌లో తొక్కిసలాట. ఆరుగురు సామాన్య భక్తులు మృతి.
ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చందనోత్సవం సమయంలో క్యూలైన్ పక్కన ఉన్న గోడ కూలి గాల్లో కలిసిన ఏడుగురు భక్తుల ప్రాణాలు.
నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల దుర్మరణం.
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పొలిటికల్ పాలన తేవడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి... దేవాలయాలకు వెళ్లే భక్తుల ప్రాణాలకు భరోసా కరువైంది! కేవలం పది నెలల కాలంలో మూడు ఆలయాలలో మూడు ఘోర దుర్ఘటనలు. ఒక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని ఉంటే, అన్ని గుడుల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే దారుణాలు జరిగేవి కాదన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. వరుస దుర్ఘటనల్లో భక్తులు దుర్మరణం చెందుతున్నా, పోయేది సామాన్యుల ప్రాణాలే కదా అన్నట్లు చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే వాదన వ్యక్తమవుతోంది.
టీడీపీ కూటమి ప్రభుత్వ పాపాలు సామాన్యుల పాలిట శాపాలుగా మారుతున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్ని విషాదాలు జరుగుతున్నా అమెరికా కంటే గొప్ప టెక్నాలజీ తెచ్చానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తుపానునే కంట్రోల్ చేశానని, సంక్షోభాలను నివారించడంలో చాలా అనుభవజ్ఞుడినని చెప్పుకొంటూ సీఎం ప్రచార ఆర్భాటంతో కాలం వెలిబుచ్చుతున్నారనే చర్చ జరుగుతోంది.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరిగి భక్తులు చనిపోతున్నా నిరోధించేందుకు చేపడుతున్న చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని, కనీసం మంచినీళ్లు కూడా సమకూర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
29 మందిని బలిగొన్న బాబు ప్రచార కండూతి
» చంద్రబాబు ప్రచార కండూతి 2015 గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29మంది భక్తుల దుర్మరణానికి కారణమైంది. రాజమహేంద్రవరం ఘాట్ వద్ద వేలాది భక్తుల సమక్షంలో సీఎంగా బాబు కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం చేసేలా వీడియో తీయాలని భావించారు. ముందు రోజే ఘాట్ గేట్లు మూసి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పడిగాపులు కాసేలా చేశారు.
చంద్రబాబు రాగానే గేట్లు తెరిచారు. భక్తులు ఒక్కసారిగా స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చనీయంగా మారింది. దీనిపై బాబు కనీసం నైతిక బాధ్యత తీసుకోలేదు. పైగా పుష్కరాల దుర్ఘటనపై విచారణ కమిషన్ నివేదికను తీవ్ర జాప్యం చేశారు. చివరికి ఎవరి బాధ్యత లేదని తేల్చారు.
» ఇక 2017లో కార్తీక మాసం సందర్భంగా నవంబరు 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవ్రిత సంగమం వద్ద కృష్ణా నదిలో పర్యాటకుల బోటు బోల్తాపడి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
» 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉండే 30పైగా ఆలయాలను కూల్చివేశారు.
» తిరుమలలో 1472లో నిర్మితమైన వేయి కాళ్ల మండపాన్ని 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూల్చివేశారు.
» చంద్రబాబు హయాంలోనే... విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇంకోవైపు, చంద్రబాబు గతంలో సీఎంగా కొనసాగిన సమయంలో భక్తులు అయ్యప్ప మాలధారణ కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ ఎగతాళిగా మాట్లాడారు.
కూటమి పాలనలో అపచారాలు ఎన్నో...
» తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో ఈ ఏడాది జనవరి 8న తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోయింది.
» తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో జనవరి 13న షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
» ఈఏడాది ఫిబ్రవరి 18న శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట టీటీడీ ఉద్యోగి, పాలకమండలి సభ్యుడికి మధ్య వివాదం చోటుచేసుకుంది. మార్చిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పవిత్ర కాశినాయన క్షేత్రంలో అన్నదాన భవనం, సత్రాలు, గోశాలను కూల్చివేశారు.
» ఏప్రిల్‌లో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో వెలిశారని భక్తులు విశ్వసించే శ్రీ కూర్మంలో పెద్దసంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి.
»300 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేట బాల శశిశేఖర ఆలయంలో ఈ ఏడాది మే 18న కొందరు వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు.


