సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గతంలో పలుమార్లు కూటమి సర్కార్‌పై ప్రజాగ్రహం వచ్చిన ప్రతీసారి బాబు డైవర్షన్ డ్రామాలకు తెరలేపారు. దీంతో, డైవర్షన్ పాలిటిక్స్‌లో మాస్టర్‌గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారం జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తామని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు.
18 నెలల కాలంలో బాబు డైవర్షన్లు..
- 2024లో విజయవాడ వరదల్ని డైవర్ట్ చేసేందుకు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు డ్రామా.
- వంద రోజుల పాలన పూర్తి అయిన సమయంలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా.
- ఉచిత గ్యాస్‌పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనగానే రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం.
- గత డిసెంబర్ తుపాను సమయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేషన్ తనిఖీల పేరుతో హడావుడి.
- తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు.
- చంద్రబాబు దావోస్ పర్యటన ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో నాటకాలు.
- ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదుడు నుంచి డైవర్ట్ కోసం వంశీ అరెస్ట్.
- కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై దృష్టి మరల్చేందుకు పోసాని అక్రమ అరెస్ట్.
- ఏపీ బడ్జెట్‌లో సూపర్ సిక్స్‌కు గుండుసున్నా పెట్టారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ కేసును తెర మీదకు తెచ్చారు.
- సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు మిథున్ రెడ్డిపై కేసు.
- డైవర్షన్‌లో భాగంగా కాకాణి గోవర్థన్‌పై అక్రమ కేసు.
- ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ అరెస్ట్‌తో డైవర్షన్.
కక్ష సాధింపులో భాగంగా..
మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.



