పట్నా: బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న నేరాలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఏర్పాట్లు సరిపోవంటూ ఆయన వ్యక్తిగత భద్రతను పెంచాలని ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్బంగా రాజకీయ శత్రువులు తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్ర యంత్రాంగం తన వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లను మరింత పెంచాలని, అప్పుడే నిర్భయంగా ప్రచారం చేయగలనన్నారు. అంతకుముందు ఆయన ఎన్నికల అధికారులను కలిశారు. సుపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సొంత పార్టీ అభ్యర్థిపైనే ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అభ్యర్థి మహాగఠ్‌బంధన్ అభ్యర్థి మద్దతు కోరారని ఆరోపించారు.
ఎన్నికల్లో హింసను సహించే ప్రసక్తే లేదు: సీఈసీ
కాన్పూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఎన్నికల్లో హింసాత్మక చర్యలను సహించే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయొచ్చని సూచించారు. ఎన్నికలు పూర్తి శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. జ్ఞానేశ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ముందు అందరూ సమానమేనని తేలి్చచెప్పారు. ఎలాంటి పక్షపాతం గానీ, వివక్ష గానీ ఉండవని అన్నారు. ప్రజాస్వామ్యం పండుగలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు.


