సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.



