పదిలం.. ప్రేమ జ్ఞాపకం
సమాధుల చర్చిగా..
● బందరు తాజ్‌మహల్
● అరబెల్లా ప్రేమ సమాధి
ఉన్న సెయింట్ మేరీస్ చర్చి
● నేడు ప్రేమికుల దినోత్సవం
మచిలీపట్నం టౌన్: ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్. దీన్ని షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలు ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మిస్తే.. 1815లో బందరు పట్టణంలో బ్రిటీష్ మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా రాబిన్‌సన్ కోసం ఓ సుందర భవనానికి రూపు నిచ్చారు. అదే సెయింట్‌మేరీస్ చర్చి. దానిలో అరబెల్లా సమాధి ఉంది. తాజ్ మహల్‌లోలేని ఓ విశేషాన్ని ఈ అరబెల్లా మందిరంలో పొందుపరిచాడు. ప్రియురాలు అరబెల్లా మృతదేహం దెబ్బతినకుండా పీటర్ ఈజిప్ట్ తదితర దేశాల నుంచి సుగంధ ద్రవ్యాలు, రసాయనాలను తెప్పించి పూయించారు. ఓ అందమైన గాజు పెట్టెలో ఆమె మృతదేహాన్ని భద్రపరిచి భూమిలో ఓ అరను ఏర్పాటు చేసి దానిలో ఉంచారు. ప్రియురాలి మృతదేహాన్ని చూడాలనుకున్నప్పుడు గోడకు ఉన్న ఒక కొయ్య చిలుకను తిప్పితే లోపల ఉన్న పెట్టి పైకి వచ్చేటట్లు అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు.
ఆ రోజుల్లోనే పెద్దలను ఎదిరించి..
మేజర్ జనరల్ పీటర్ ఆనాటి ఆంగ్లేయ సైన్యాధికారిగా మచిలీపట్నంలో పని చేశారు. అక్కడ కెప్టెన్‌గా పని చేస్తున్న రాబిన్‌సన్ కుమార్తె అరబెల్లా సౌందర్యానికి ముగ్ధుడైన మేజర్ పీటర్ ఆమెను ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె తండ్రి రాబిన్‌సన్, మతాధికారులు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ప్రేమైక సహజీవనాన్ని కొనసాగించారు. వారిద్దరి చర్యను ఎవరూ హర్షించ లేదు. ఆ సమయంలో పీటర్, రాబిన్‌సన్‌ల మధ్య కలతలు వచ్చాయి. అరబెల్లా ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో 1809 నవంబర్ 6వ తేదీన పీటర్ ఒడిలోనే ఆమె కన్నుమూసింది. పీటర్ అరబెల్లా మృతదేహాన్ని పెళ్లి గౌను, ఉంగరాలతో అలంకరించి అంతిమ వీడ్కోలు ఇచ్చారు.
ప్రియురాలి సమాధే దేవాలయం..
అరబెల్లా మృతదేహాన్ని పరిశుద్ధ యోహాను అవరణలోనూ, బందరుకోటలోని ఆంగ్లేయుల శ్మశాన వాటికలో సమాధి చేసేందుకు నాడు పెద్దలు అంగీకరించలేదు. దీంతో పట్టణంలోని బైపాస్‌రోడ్ ఆనందపేట ఎదురుగా ఉన్న స్థలంలో అరబెల్లా మృతదేహాన్ని భద్రపరిచారు. ప్రతి రోజూ ఆమెను చూసుకుని కుమిలిపోయేవారు. అరబెల్లా మృతదేహాన్ని చర్చిలోకి అనుమతించకపోయినా ఆమె భౌతికదేహం ఉంచిన చోటే దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అరబెల్లా తన ప్రియమైన స్నేహితురాలిగా వర్ణిస్తూ షీటర్ ఓ శిలాఫలకాన్ని సమాధి గోడపై అమర్చారు.
ఆయన మద్రాసు బదిలీపై వెళుతూ ఈ పరిశుద్ధ సెయింట్ మేరీస్ చర్చిని (సమాధుల చర్చి) ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారు. 1819 నుంచి మధ్య చర్చిలో ప్రార్థనలకు అనుమతిచ్చారు. అదే ఏడాదే పీటర్ మద్రాస్‌లో మృతి చెందారు. ఆయన పేరుతో మద్రాసులో ఓ ఉద్యానవనం, ఒక రోడ్డు ఏర్పాటు చేశారు. మేరీస్ చర్చిలో పని మనిషి అనుకోకుండా గోడకు అమర్చిన కొయ్య చిలకను తిప్పింది. దీంతో సమాధిపై రాయి తొలిగి అరబెల్లా మృతదేహం పైకి రావటంతో అది చూసిన ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ ఈ అమరికను శాశ్వతంగా మూయించారు. ప్రస్తుతం ఈ చర్చి ఆవరణలో క్రైస్తవ మతస్తుల మృతదేహాలను సమాధి చేస్తున్నారు. ఆ ఆవరణలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు చర్చి నియమాల ప్రకారం కొంత మొత్తాన్ని ఫీజుగా వసూలు చేస్తున్నారు.
మచిలీపట్నంలో శతాబ్దాల నాటి అరబెల్లా, జాన్ పీటర్‌ల అమర ప్రేమగాథకు చిహ్నమే ఆ సమాధి. ఇది ఉన్నచోటే సుందరమైన సెయింట్‌మేరీస్ చర్చి నిర్మించారు. దీన్ని ‘బందరు తాజ్‌మహల్’గా పిలుస్తారు. ఇది నాటి ప్రేమగాథను నేటి తరానికి తెలియజేస్తోంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరి ‘ప్రేమ జ్ఞాపకం’పై ప్రత్యేక కథనం.


