వినియోగదారునికి నూతన వాహనాన్ని ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారునికి నూతన వాహనాన్ని ఇవ్వాలి

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

వినియోగదారునికి నూతన వాహనాన్ని ఇవ్వాలి

వినియోగదారునికి నూతన వాహనాన్ని ఇవ్వాలి

వినియోగదారునికి నూతన వాహనాన్ని ఇవ్వాలి హోలీ పండుగ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం కాలువలో దూకిన వ్యక్తి గల్లంతు

చిలకలపూడి(మచిలీపట్నం): కాసా మోటార్స్‌ సంస్థ నూతన వాహనాన్ని, వాహనం ఖరీదు వడ్డీతో సహా చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్‌కుమార్‌, సభ్యురాలు శ్రీ లక్ష్మీరాయల శుక్రవారం తీర్పు చెప్పారు. మచిలీపట్నంకు చెందిన బత్తుల హరినాథ్‌ కాసా మోటార్స్‌ మచిలీపట్నం బ్రాంచ్‌లో 2024 జూలై 3వ తేదీన రూ.1,63,000 చెల్లించి ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తరువాత బండికి చార్జింగ్‌ పెట్టగా అది చార్జ్‌ కావటం లేదు. దీంతో హరినాథ్‌ షోరూమ్‌లో వాహనాన్ని అప్పగించారు. షోరూమ్‌లో మూడు రోజుల పాటు బండి ఉంచుకుని చెక్‌ చేసి తిరిగి ఇచ్చారు. మళ్లీ బండికి అదే సమస్య పునరావృతం కావటంతో తిరిగి ఆయన షోరూమ్‌కు అప్పగించారు. ఎన్ని రోజులైనా సమస్య తీరకపోవటంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం సభ్యులు కొత్త వాహనం ఇవ్వాలని, లేదా వాహనం రూ.1.63 లక్షలు కొనుగోలు తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పు చెప్పారు. దీంతో పాటు మానసిక వేదనకు రూ.25 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు షోరూమ్‌ ప్రతినిధులు ఫిర్యాదుదారునికి 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): హోలీ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి–షాలీమార్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–షాలీమార్‌ (07512) ప్రత్యేక రైలు ఈ నెల 26, మార్చి 1, 5 తేదీలలో ఉదయం 5.40 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు షాలీమార్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07513) ఈ నెల 27, మార్చి 2, 6 తేదీలలో మధ్యాహ్నం 12.45 గంటలకు షాలీమార్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస తదితర స్టేషన్‌లలో ఆగుతుంది.

పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన పామర్రులో శుక్రవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన అబ్దుల్‌ అల్లా బక్షు(35) విజయవాడలోని ఓ వేడుక నిమిత్తం బైక్‌పై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నాడు. మార్గ మధ్యంలో స్థానిక 14వ మైలు రాయి వద్దకు చేరుకుంటుండగా ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వేగంగా వచ్చిన జేసీబీ బైక్‌పై వస్తున్న అల్లాబక్షుని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు తగిలిన అల్లాబక్షు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం చేరుకున్న పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్‌ వివరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యతో వివాదం నేపథ్యంలో...

పెనమలూరు: భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడటంతో భయంతో భర్త బందరు కాలువలో దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పెనమలూరు పల్లిపేటకు చెందిన షేక్‌ అనూష 12 ఏళ్ల క్రితం గుంటూరుకు చెందిన తాపీ పనులు చేసే షేక్‌ నాగుల్‌మీరా(36)ను వివాహం చేసుకుంది. అనూష పటమటలో ఏసీ కంపెనీలో పని చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త మద్యానికి బానిసగా మారడంతో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య అనూష 10 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో సహా పెనమలూరులోని పుట్టింటికి వచ్చి ఉంటోంది. భర్త నాగుల్‌మీరా అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళుతుంటాడు. ఆ విధంగానే రెండు రోజుల క్రితం పెనమలూరులోని భార్య వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడటంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరింది. పోలీసుల వద్దకు వెళుతుందనే భయంతో భర్త పెనమలూరు వంతెన వద్ద బందరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే యత్నం చేసినా అతనిని ఆపలేకపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బందరు కాలువలో గల్లంతైన నాగుల్‌మీరా కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement