ఇంటింటా మార్మోగుతున్న శివనామస్మరణ
యనమలకుదురులో మహాశివరాత్రి సందడి విద్యుద్దీపాలంకరణలో శోభాయమానంగా వెలుగొందుతున్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం నేడు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెనమలూరు: చరిత్ర ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. గ్రామంలో ఇప్పటికే పండుగ సందడి చోటు చేసుకుంది. ప్రతి ఇంటా శివనామస్మరణమే వినబడుతుంది. ఆలయంలో గడచిన కొద్ది సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. దాత సంగా నరసింహారావు శివాలయం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు పెండ్లి కుమారుడిగాస్వామివారు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుపుతారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు స్వామివారు, అమ్మవారిని పెడ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తెగా అలంకరిస్తారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామివార్లను అలంకరించి ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటలకు విఘ్నేశ్వరపూజ, దీక్షాధారణ. అఖండస్థాపన, అంకురార్పణ, మండపారాధన, అగ్నిప్రతిష్ట పలు పూజా కార్యక్రమాలు చేస్తారు. ఆదివారం వేకువజామునుంచే స్వామివారి దర్శనం ఉంటుంది. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం చేస్తారు.
ప్రభల హడావుడిలో భక్తులు
మహాశివరాత్రికి అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రభల ప్రదర్శన. కొండ చుట్టూ ప్రభలు తిప్పటానికి అధికారులు 40 ప్రభలకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. ఇవే కాకుండా చిన్న ప్రభలు కూడా ఉదయం నుంచే కొండ చుట్టూ తిప్పుతారు. దేవుడి ప్రభ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవగానే సీరియల్ ప్రకారం మిగతా ప్రభలు ప్రదక్షిణకు బయలుదేరుతాయి. సోమవారం ఉదయం వరకు ప్రభలు తిరుగుతాయి. ప్రభలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గ్రామంలో ప్రభలు పోటీపోటీగా భక్తులు సిద్ధం చేస్తున్నారు. గ్రామ వీధుల్లో ఎక్కడ చూసినా ప్రభలే కనబడుతున్నాయి.
పోలీసుల ఆంక్షలు
ప్రభల ప్రదర్శనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభల ఎత్తు 60 అడుగులు మాత్రమే ఉండాలని, డీజేలు పెట్టరాదని, సినీగీతాలు పెట్టి డ్యాన్స్‌లు వేయరాదని నిబంధన పెట్టారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టరాదని తెలిపారు. మహాశివరాత్రికి భారీ పోలీసుల బందోబస్తు పెట్టారు. పోలీసు అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేశారు.
ఇంటింటా మార్మోగుతున్న శివనామస్మరణ
ఇంటింటా మార్మోగుతున్న శివనామస్మరణ


